దేశంలో గాడిదల సంఖ్యను పెంచేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సరికొత్త ప్రోత్సాహకాల్ని అందిస్తోంది. గాడిదల సంఖ్య తగ్గుతుండటాన్ని గుర్తించిన కేంద్రం అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టింది. నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్ (LIM) స్కీమ్ ద్వారా గాడిదల పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా రైతులు, వ్యాపారులకు మొత్తం ప్రాజెక్ట్ వ్యయంలో 50 శాతం వరకు సబ్సిడీని గరిష్ఠంగా రూ. 50 లక్షల వరకు అందిస్తామని ప్రకటించింది. అంటే ఇక్కడ బ్యాంక్ లోన్ ద్వారా మీరు తీసుకునే మొత్తంలో 50 శాతం వరకు సబ్సిడీ వస్తుందన్నమాట. ఈ స్కీమ్ ద్వారా దేశంలో గాడిదల సంఖ్యను పెంచడం సహా గ్రామీణ ఆదాయాన్ని పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ కింద పశు సంవర్ధక, పాడి పరిశ్రమ విభాగం.. ఈ స్కీంకు సంబంధించి మార్గదర్శకాల్ని జారీ చేసింది. గాడిదలతో పాటు గుర్రాలు, ఒంటెల పెంపకానికి కూడా ఇదే విధంగా ప్రోత్సాహకాల్ని అందిస్తోంది.
అర్హులెవరు?
ఈ పథకంలో చేరేందుకు కొన్ని అర్హతల్ని, షరతుల్ని విధించింది. రైతులు మాత్రమే కాకుండా.. ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ , స్వయం సహాయక బృందాలు, జాయింట్ లియబులిటీ గ్రూప్స్, సహకార సంఘాలు ఇంకా సెక్షన్-8 కంపెనీలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇక గాడిదల పెంపకం యూనిట్ ఏర్పాటు చేసేందుకు కనీసం 50 ఆడ గాడిదలు, 5 మగ గాడిదలు కచ్చితంగా ఉండాలనే షరతు విధించింది. ఈ సబ్సిడీని ప్రభుత్వం రెండు విడతల కింద విడుదల చేస్తుంది. బ్యాంక్ లోన్ ఆమోదం తర్వాత మొదటి విడత రాయితీ వస్తుంది. అప్లికేషన్ ఫారం పూర్తి చేసి అధికారులు ధ్రువీకరించిన తర్వాత రెండో విడత సబ్సిడీ అందుతుంది. నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్ ద్వారా ఈ పథకం కోసం అప్లై చేసుకోవచ్చు.
లైవ్‌స్టాక్ సెన్సస్ 2019 ప్రకారం.. భారతదేశంలో 2019లో సుమారు 1.23 లక్షల గాడిదలే ఉన్నాయి. 2012తో పోలిస్తే దాదాపు 60 శాతం తగ్గింది. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో రవాణా, నిర్మాణ పనుల్లో గాడిదల్ని విస్తృతంగా ఉపయోగించేవారు. తర్వాత్తర్వాత యంత్రాల వినియోగం పెరగడంతో వీటి అవసరం క్రమంగా తగ్గుతూ వచ్చింది.
వ్యాపార అవకాశాలు..
ఇటీవలి కాలంలో గాడిదల పెంపకంపై యువత ఆసక్తి చూపుతోంది. కొందరు ఔత్సాహికులు గాడిదల పెంపకం ద్వారా లక్షల్లో సంపాదిస్తున్నారు కూడా. ఇప్పుడు గాడిదల పెంపకం ప్రత్యేక పశుసంవర్ధక వ్యాపారంగా మారుతుంది. గాడిదల్ని విక్రయించడం సహా గ్రామీణ పరిశ్రమలకు సరఫరా చేయడం ద్వారా ఆదాయం పొందొచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా గాడిద పాలను ఎంతో శ్రేష్ఠమైనవిగా చెబుతుంటారు. వీటి విలువ చాలా ఎక్కువ. ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా గాడిద పాలు ప్రీమియం ప్రొడక్ట్‌గా గుర్తింపు పొందాయి. వీటిని హెల్త్ కేర్ ప్రొడక్ట్స్, స్కిన్ కేర్ కాస్మెటిక్ ప్రొడక్ట్స్‌లో ఉపయోగిస్తుంటారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa