అదానీ గ్రూప్ అధినేత, అపర కుబేరుడు గౌతమ్ అదానీ అంటే ఇప్పుడు దాదాపు అందరికి తెలుసు. నౌకశ్రయాలు, మైనింగ్, ఎయిర్‌పోర్టులు, గ్యాస్, ఎలక్ట్రిసిటీ అంటూ దాదాపు అన్ని రంగాల వ్యాపారాల్లో అదానీ ప్రవేశించారు. గత ఏడాది నుంచి నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచ కుబేరుల్లో అదానీ 19వ స్థానంలో కొనసాగుతున్నారు. ఆయన సంపద గంటకు కోట్ల రూపాయలు ఉంటుంది. అలాంటి వ్యక్తి వేల కోట్లు సంపాదించారంటే చాలా మంది తండ్రులు, తాతలు ఇచ్చిన ఆస్తులు అని భావిస్తారు. కానీ, అదానీ చిల్లి గవ్వ లేకుండా ముంబైకి వచ్చి వ్యాపార మెలుకువలు నేర్చుని ఇప్పుడు దేశంలోని అగ్ర వ్యాపారవేత్తల్లో ఒకరిగా నిలిచారు.
19 ఏళ్ల వయసులోనే వజ్రాల ట్రేడింగ్ ప్రారంభించారట గౌతమ్ అదానీ. తనకు తొలి కమీషన్ గా రూ.10 వేలు వచ్చినట్లు స్వయంగా ఆయనే చెప్పారు. అదానీ ఇంటర్నేషనల్ స్కూల్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా తన జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. తన వ్యాపార ప్రయాణం ఎలా మొదలైందో చెప్పుకొచ్చారు. ' 16 ఏళ్ల వయసులో అహ్మదాబాద్ రైల్వే స్టేషన్‌లో గుజరాత్ మెయిల్ రైలు ఎక్కి ముంబై చేరుకున్నా. నా చేతిలో చిల్లిగవ్వ లేదు. ఓ వజ్రాల వ్యాపార సంస్థలో చేరా. అక్కడే ట్రేడింగ్ మెలుకువలు అభ్యసించా. మూడేళ్ల తర్వాత ముంబైలోని జువేరీ బజార్‌లో నా 19వ ఏట సొంత డైమండ్ ట్రేడింగ్ బ్రోకరేజీ మొదలు పెట్టాను. జపాన్‌కు చెందిన బయ్యర్ ఒకరు తొలి ట్రేడ్ నిర్వహించారు. నాకు రూ.10 వేల కమీషన్ వచ్చింది. అలా నా వ్యాపార ప్రయాణం ప్రారంభమైంది.' అని చెప్పారు గౌతమ్ అదానీ.
1981 సంవత్సరంలో తన అన్నయ్య మహాసుఖ్‌బాయ్ పీవీసీ ఫిల్మ్ ఫ్యాక్టరీ నిర్వహించే వారని, ఆయనకు సాయపడేందుకు గుజరాత్ తిరిగి వచ్చినట్లు గుర్తు చేసుకున్నారు. అదానీ. 1988లో అదానీ ఎక్స్‌పోర్ట్స్ పేరుతో కమొడిటీ ట్రేడింగ్ వెంచర్ ప్రారంభించానని, అది 1994లో స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ అయిందన్నారు. అదే సంస్థ ఇప్పుడు అదానీ ఎంటర్ ప్రైజెస్‌గా అవతరించినట్లు గుర్తు చేసుకున్నారు.
తాను కాలేజీకి వెళ్లుంటే తన జీవితం ఇంకో మాదిరిగా ఉండేదన్నారు అదానీ. తనను ఎప్పుడూ ఈ ప్రశ్న వేధిస్తూనే ఉంటుందన్నారు. ' జీవితంలో అనుభవపూర్వకంగా తెలివితేటలు సంపాదించుకోవచ్చు. కానీ, జ్ఞానాన్ని సంపాదించాలంటే చదువు చాలా ముఖ్యం. ఒక వేళ నేను కాలేజీకి వెళ్లి కళాశాల చదువు పూర్తి చేసి ఉంటే నా సామర్థ్యం ఇంకా మెరుగ్గా ఉండేదని భావిస్తాను. ఎప్పుడూ దీని గురించి ఆలోచిస్తూనే ఉంటా.' అని అదానీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. జీవితంలో ఎదురయ్యే ఎదురుదెబ్బలు, వైఫల్యాలు విజయానికి అడ్డంకులు కావని, అవి విజయంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. తరగతి గదులనే లాంచ్ ప్యాడ్‌లుగా ఉపయోగించుకుని తమ కలలన సాకారం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. మరో 100 మంది గౌతమ్ అదానీలు ఉద్భవించాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు.