ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో కనీసం 8 మంది ఉద్యోగులు ఉండేలా ప్రభుత్వం సర్దుబాటు చర్యలు మొదలు పెట్టింది. రాష్ట్రంలో మొత్తం 15,004 గ్రామ, వార్డు సచివాలయాల్లో దాదాపు 1.34 లక్షల మంది ఉద్యోగులున్నారు. ప్రస్తుతం దాదాపు 7,900 సచివాలయాల్లో 8 మందికంటే ఎక్కువగానే ఉద్యోగులు ఉన్నారు. సుమారు 3,300 సచివాలయాల్లో 8 మంది కంటే తక్కువ సంఖ్యలో ఉన్నారు. మిగిలిన చోట్ల 8 మంది చొప్పున పనిచేస్తున్నారు. ఎక్కువ మంది సిబ్బంది ఉన్న సచివాలయాల నుంచి తక్కువ సంఖ్యలో ఉన్న సచివాలయాలకు ఉద్యోగులను సర్దుబాటు చేస్తున్నారు.
ఇటీవల బదిలీల తర్వాత కొన్ని సచివాలయాల్లో నిర్ణీత సంఖ్య 8మంది కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉండగా మరికొన్నింటిలో తక్కువ మంది ఉన్నార. దీంతో సమాన సంఖ్యలో ఉద్యోగులు ఉండేలా ప్రభుత్వం రేషనలైజేషన్‌కు చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు విధి విధానాలతో గ్రామ, వార్డు సచివాలయాలు – వాలంటీర్లు శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్ ఆదేశాలు జారీ చేశారు. 8 మంది పనిచేస్తున్న చోట ఎవరికీ బదిలీలు ఉండవని అధికారులు తెలిపారు. ఇలా సుమారు 5,000 మందికి స్థానచలనం కలుగుతుందన్నారు. జిల్లాల ప్రాతిపదికన కలెక్టర్ల ఆధ్వర్యంలో సర్దుబాటు జరుగుతుంది అంటున్నారు. ఏ జిల్లాలోని వారికి ఆ జిల్లాలోనే బదిలీ ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందే రానున్న పది పదిహేను రోజుల్లో మొత్తం ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు తెలిపారు.
ఏ కేటగిరీ ఉద్యోగుల ఖాళీలో అదే కేటగిరీ ఉద్యోగితోనే సర్దుబాటు చేయనుంది ప్రభుత్వం. జిల్లా ప్రాతిపదిక జిల్లాల పరిధిలోనే సర్దుబాటు ఉంటుంది.. ఎక్కువ మంది సిబ్బంది ఉన్న సచివాలయాల నుంచి తక్కువ సంఖ్యలో ఉద్యోగులు ఉన్న సచివాలయాలకే బదిలీ చేస్తారు. ఒకవేళ ఎక్కడైనా భార్య, భర్త వేర్వేరు సచివాలయాల్లో పనిచేస్తుంటే.. వారి అభ్యర్ధన మేరకు ఇరువురికీ ఒకే చోటకు బదిలీకి అవకాశం కల్పిస్తారు. వీరికి ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు కూడా అవకాశం కల్పిస్తారు. గ్రామ సచివాలయాల్లో నాలుగు కేటగిరీల ఉద్యోగులు, వార్డు సచివాలయాల్లో మూడు కేటగిరీ ఉద్యోగులకు మాత్రమే పరిమితమై ఈ సర్దుబాటు ఉంటుంది.
గ్రామ సచివాలయాల్లో నాలుగు కేటగిరీల్లో.. మొదట ప్రాధాన్యతగా గ్రామ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లతో సర్దుబాటు ప్రక్రియ ఉంటుంది. అప్పటికీ సర్దుబాటు చేయాల్సిన సచివాలయాలు మిగిలితే రెండో ప్రాధాన్యతగా మహిళా పోలీసు (గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి)తో సర్దుబాటు చేస్తారు. మూడో ప్రాధాన్యతలో డిజిటల్ అసిస్టెంట్లు, అప్పటికీ మిగిలిపోతే నాలుగో ప్రాధాన్యతగా పంచాయతీ కార్యదర్శి విభాగాలు ఉంటాయి. ఇలా ప్రాధాన్యతల వారీగా సర్దుబాటు చేస్తారు. వార్డు సచివాలయాల్లో మొదటి ప్రాధాన్యతగా వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ సెక్రటరీ, రెండో ప్రాధాన్యతలో మహిళా పోలీసు, మూడో ప్రాధాన్యతగా వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ విభాగాలు ఉన్నాయి. ఉద్యోగులతో నేరుగా కౌన్సెలింగ్ ద్వారా ఈ సర్దుబాటు ప్రక్రియ ఉంటుంది.