ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గోదావరి జిల్లాల పర్యటనకు పవన్.. గెలుపే లక్ష్యంగా మూడంచెల వ్యూహం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 10, 2024, 09:08 PM

ఏపీలో 2024 శాసనసభ ఎన్నికల వేడి మొదలైంది. ఇప్పటికే సిద్ధమంటూ సీఎం వైఎస్ జగన్.. రా కదలిరా అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారాలు ప్రారంభించారు. టీడీపీ నుంచి నారా లోకేష్ కూడా త్వరలోనే రంగంలోకి దూకనున్నారు. అటు కాంగ్రెస్ తరుఫున వైఎస్ షర్మిల రాష్ట్రాన్ని ఇప్పటికే చుట్టేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేనాని కూడా రంగంలోకి దిగారు. ఫిబ్రవరి 14 నుంచి పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ వెల్లడించింది.


పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 14వ తేదీ నుంచి 17వ తేదీ వరకూ పర్యటన సాగుతుంది. తొలి రోజు భీమవరంలో పవన్ కళ్యాణ్ వివిధ సమావేశాలలో పాల్గొంటారు. ఆ తర్వాత అమలాపురం, కాకినాడ, రాజమండ్రిలలో జరిగే సమావేశాలకు హాజరవుతారు. ఈ పర్యటనలో భాగంగా పార్టీ ముఖ్య నాయకులు, స్థానికంగా ఉన్న క్రియాశీలక కార్యకర్తలు, ప్రముఖులతో పవన్ కళ్యాణ్ భేటీ అవుతారు. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులతో భేటీ కానున్న జనసేనాని.. వచ్చే ఎన్నికల్లో సమన్వయంతో ఎలా ముందుకెళ్లాలనే దానిపై వారితో చర్చించనున్నారు. నియోజకవర్గాల స్థాయిలో ఇరు పార్టీల నాయకులు, శ్రేణుల మధ్య సుహృద్భావ వాతావరణం ఏర్పాటు, పొత్తు ఫలితాల లక్ష్యంగా భేటీలు జరుగుతాయని జనసేన వెల్లడించింది.


మరోవైపు పవన్ కళ్యాణ్ పర్యటనలు మూడు దశలుగా నిర్వహించాలని జనసేన నిర్ణయించింది. తొలి దశలో ముఖ్య నాయకులతో పవన్ కళ్యాణ్ భేటీ అవుతారు. రెండో దశలో క్రియాశీలక కార్యకర్తలు, మహిళల సమావేశాలలో పాల్గొంటారు. ఇక మూడో దశలో ఎన్నికల ప్రచారం చేపడతారు. అయితే ఎన్నికల ప్రచారం చేపట్టేనాటికి మూడుసార్లు ఆయా ప్రాంతాలను చుట్టేసే లక్ష్యంగా జనసేనాని పర్యటనల షెడ్యూల్‌ను జనసేన ఖరారు చేస్తోంది. ఇందులో భాగంగా ఉభయ గోదావరి జిల్లాల పర్యటన అనంతరం.. ఇతర ప్రాంతాలకు సంబంధించిన పర్యటనలను ఖరారు చేసేందుకు జనసేన పార్టీ ప్రచార కమిటీ ప్రణాళికలను సిద్దం చేస్తోంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com