ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ కళ్యాణ్ వెనుక ఈ జానీ మాస్టర్ ఉన్నాడు.. ఖబడ్దార్: జానీ మాస్టర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 10, 2024, 09:15 PM

పవన్ కళ్యాణ్ మీద విమర్శలు గుప్పించేవారిపై జానీ మాస్టర్ ఫైర్ అయ్యారు. పవన్ జోలికొస్తే పీర్ల పండగేనంటూ వార్నింగ్ ఇచ్చారు. నెల్లూరులో జానీ మాస్టర్ ఆధ్వర్యంలో కేవీ సర్కిల్ నుంచి వెంకటేశ్వరపురంలోని టిడ్కో ఇళ్లవరకూ ర్యాలీ చేశారు. అనంతరం మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన జానీ మాస్టర్ వైసీపీ నేతల తీరుపై మండిపడ్డారు. టిడ్కో ఇళ్లను వెంటనే పేదలకి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో పూర్తైన టిడ్కో ఇళ్లకు వైసీపీ రంగులు వేసుకుందన్న జానీ మాస్టర్.. కొన్నింటిని మాత్రమే లబ్ధిదారులకు ఇచ్చారని విమర్శించారు. మిగతావారికి సొంతింటి కల కలగానే మిగిలిపోయిందని మండిపడ్డారు.


ఈ క్రమంలోనే వైసీపీ నేతల తీరుపై ఓ రేంజులో ఫైరయ్యారు జానీ మాస్టర్. టిడ్కో ఇళ్లను సంక్రాంతికి ఇస్తానని చెప్పిన అనిల్ కుమార్ కనిపించకుండా పోయారంటూ సెటైర్లు వేశారు. సిద్ధం సభలకు పేద ప్రజల డబ్బులతో ఫ్లెక్సీలు వేయించుకున్నారన్న జానీ మాస్టర్.. ఆ డబ్బులు పేదలకు ఇచ్చినా వారి రాతలు మారేవని అభిప్రాయపడ్డారు. వైసీపీ నేతలు పదేపదే పవన్ కళ్యాణ్ జోలికొస్తున్నారన్న జానీ మాస్టర్.. పవన్ కళ్యాణ్ వెనుక జానీ మాస్టర్ ఉన్నాడనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని అన్నారు. పవన్ జోలికొస్తే పీర్ల పండగేనంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీవ్యాప్తంగా పేదల కోసం కట్టించిన ఇళ్లను లబ్ధిదారులకు ఇచ్చేంతవరకు వారి తరుఫున పోరాడుతానని జానీమాస్టర్ హామీ ఇచ్చారు.


జానీ మాస్టర్ ఇటీవలే జనసేనలో చేరారు. కమెడియన్ పృథ్విరాజ్, జానీమాస్టర్ ఇద్దరూ ఒకేరోజు పవన్ కళ్యాణ్ సమక్షంలో కండువా కప్పుకున్నారు. అయితే పార్టీలోకి ఇటీవల చేరినప్పటికీ.. గత కొంతకాలంగా జానీ మాస్టర్ జనసేన కీలక నేతలతో టచ్‌లో ఉంటూ వస్తున్నారు. అంగన్వాడీల ధర్నా సమయంలోనూ జానీ మాస్టర్ వారికి మద్దతుగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నెల్లూరు జిల్లాకు చెందిన జానీ మాస్టర్.. పవన్ కళ్యాణ్‌కు పెద్ద ఫ్యాన్. అదే అభిమానంతో జనసేనాని పార్టీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలోని ఏదో ఒక స్థానం నుంచి జనసేన తరుఫున బరిలోకి దిగాలని జానీమాస్టర్ భావిస్తున్నట్లు తెలిసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com