తెలంగాణ అసెంబ్లీలో ఏపీ మంత్రి రోజా ప్రస్తావన వచ్చింది. తెలుగు రాష్ట్రాల మధ్య ప్రాజెక్టులు, నీటి వివాదాలపై రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారు. ఈ క్రమంలో గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కృష్ణా ప్రాజెక్టులు కేంద్రానికి రాసిచ్చేశామంటూ కాంగ్రెస్‌ను బద్నాం చేస్తున్నారని.. అసలు కృష్ణాజలాలను ఏపీకి రాసిచ్చింది కేసీఆర్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రేవంత్‌రెడ్డి కీలక అంశాలను ప్రస్తావించారు.
ప్రగతిభవన్లో జగన్‌కు కేసీఆర్ పంచభక్ష్య పరమాన్నాలు పెట్టి జీవో 203 రాసిచ్చారన్నారు రేవంత్ రెడ్డి. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ప్రగతి భవన్లో కేసీఆర్ డైనింగ్ టేబుల్‌పైనే పునాదిరాయి పడిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ ఏపీ పోలీసులు ఏకే–47 తుపాకులతో వచ్చి పూర్తిగా తెలంగాణ భూభాగంలో ఉన్న నాగార్జునసాగర్‌ను ఆక్రమించుకుంటే చేతగాని సన్నాసుల్లా ఇక్కడి ప్రభుత్వం చూస్తుండిపోయిందన్నారు. ఇంటిదొంగల సహకారం లేకుంటే వాళ్లు వచ్చేవారా? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ రాయలసీమకు వెళ్లి.. మంత్రి రోజా పెట్టిన రాగిసంగటి, రొయ్యల పులుసు తిని రాయలసీమను రతనాలసీమను చేస్తా అని వచ్చిండు అంటూ రేవంత్ చురకలంటించారు. అలుసు ఇచ్చినందునే.. తెలంగాణ జలాలను వాళ్లు కొట్టుకుపోయారని.. ఇప్పుడు తామొచ్చాక అట్లెట్లా కొట్టుకుపోతారని ప్రశ్నిస్తున్నారని రేవంత్ వ్యాఖ్యలు చేశారు. కేంద్రం దుర్మార్గంగా ప్రాజెక్టులను లాక్కుంటుంటే అడ్డుకోకుండా సహకరించింది బీఆర్ఎస్ కాదా అన్నారు. రూ.97,500 కోట్లు ఖర్చు చేసిన కాళేశ్వరంతో 90 వేల ఎకరాలకు కూడా నీళ్లు అందలేదన్నది వాస్తవం కాదా? అన్నారు.
కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి మేం అప్పగించామంటూ బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారన్నారు సీఎం రేవంత్. కృష్ణా జలాల విషయంలో సెంటిమెంటును రెచ్చగొట్టాలని ప్రతిపక్ష నాయకులు భావిస్తున్నారని.. ప్రభుత్వ పాలనలో ఫలానా లోపాలున్నాయని, వాటిని సరిచేసుకోవాలని ప్రతిపక్ష నాయకుడు సూచించడం ఆయన గౌరవాన్ని పెంచుతుందే తప్ప తగ్గించదన్నారు. వంద రోజులైనా పూర్తిచేసుకోని తమ ప్రభుత్వాన్ని ప్రతిపక్షం పదేపదే విమర్శిస్తోందని.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వంద రోజుల్లో కచ్చితంగా నెరవేర్చుతామన్నారు.
రైతుబంధు ఇవ్వలేదని రైతులను తమ ప్రభుత్వంపై రెచ్చగొట్టాలని ప్రతిపక్ష నాయకులు చూస్తున్నారన్నారు. 2018 నుంచి 2023 వరకు ప్రతి యాసంగిలో రైతుబంధు నిధులు వేయడంలో గత ప్రభుత్వం నాలుగు నుంచి తొమ్మిది నెలల పాటు జాప్యం చేసిందన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ప్రభుత్వం ఉచిత ప్రయాణం కల్పిస్తే ఆటో రాముడు ఆటో లోపల కెమెరా పెట్టి డ్రామా చేశారన్నారు. గిరాకీ లేదని ప్రజాభవన్ ఎదుట ఒకరు ఆటో దహనం చేశారన్నారు. తెలంగాణ ఉద్యమంలో రూ.వంద పెట్టి పెట్రోలు కొనుక్కున్న ఒక నాయకుడు అగ్గిపెట్టె తెచ్చుకోలేదని సెటైర్లు పేల్చారు.