తిరుపతిలోని నలుగురు పోలీసులపై ఎన్నికల సంఘం కొరడా ఝుళిపించింది. తిరుపతి లోక్‌సభ ఎన్నికల సమయంలో తిరుపతిలో దొంగ ఓట్లు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఎవరూ లేని ఇంట్లో పదుల సంఖ్యలో ఓట్ల నమోదైనట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. చనిపోయిన వాళ్లకు సైతం ఓటు హక్కు కల్పించారని సైతం విమర్శలు వచ్చాయి. దీనిపై విపక్షాలు పోలీసులు, కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దొంగ ఓట్లు నమోదు చేసిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదుకు జతగా ఆధారాలు కూడా సమర్పించారు. అయితే ఈ కేసులో తిరుపతి పోలీసులు నిర్లక్ష్యం వహించారనే విమర్శలు వచ్చాయి. దీనిపై సీరియస్ అయిన ఎన్నికల సంఘం.. తిరుపతి తూర్పు, పశ్చిమ పోలీసులపై కొరడా ఝుళిపించింది.
తిరుపతి ఉప ఎన్నికల సమయంలో తిరుపతి నగర తూర్పు, పశ్చిమ సీఐలు పనిచేసిన శివప్రసాద్ రెడ్డి, శివ ప్రసాద్ మీద ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు వేసింది. అలాగే తిరుపతి తూర్పు ఎస్సై జయస్వాములు, హెడ్ కానిస్టేబుల్ ద్వారకానాథ్ రెడ్డి సస్పెండ్ చేసింది. అలిపిరి సీఐ దేవేంద్ర కుమార్‌ను వీఆర్‌కు పంపింది. ఉప ఎన్నిక సమయంలో దొంగ ఓట్ల కేసును నీరు గార్చారని వీరిపై ఆరోపణలు ఉన్నాయి. తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికల సమయంలో అధికార వైసీపీ 34 వేల దొంగ ఓట్ల ఎపిక్ కార్డులను ఉపయోగించి ఓట్లు వేయించుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రతిపక్షాలు దీనిపై పెద్దఎత్తున విమర్శలు ఎక్కుపెట్టాయి. ఎన్నికల అధికారులకు ఫిర్యాదు సైతం చేశాయి. ఈ కేసులోనే సమగ్ర విచారణ చేపట్టకుండా పోలీసులు నీరుగార్చారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈసీ చర్యలు తీసుకోగా ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డి ఉత్తర్వులు జారీచేశారు.