ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ చిత్ర విచిత్రమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సాధారణంగా ఎన్నికల ప్రచారం సమయంలో నేతలు చేసే ఫీట్లు వేరే లెవల్లో ఉంటాయి. ఎప్పుడూ మన ఇంటి ముఖం చూడని లీడర్లు ఇంటి గడప తొక్కుతారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నానా తిప్పలు పడతారు. మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు ఇంట్లోని పాత్రలు కడగడం, వంట చేయడం దగ్గర నుంచి ఇంటి బయటున్న బుడ్డోడికి స్నానం చేయించడం వరకూ.. నానా పనులూ చేస్తారు. అయితే తిరుపతి జిల్లాలో మాత్రం వింత ఘటన జరిగింది. మీ అమూల్యమైన ఓటు నాకే వేయాలంటూ శ్మశానంలోని సమాధుల వద్ద ప్రచారం చేశాడో వ్యక్తి.
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం చంద్రగిరిలోని శ్మశాన వాటికలో ఓ వ్యక్తి ఎన్నికల ప్రచారం నిర్వహించాడు. శ్మశానంలోని ప్రతి సమాధి వద్దకు వెళ్లి వినతి పత్రం అందించి మీ అమూల్యమైన ఓటును తనకే వేసి, వేయించి గెలిపించాలని ప్రార్థన అంటూ ఓట్లు అభ్యర్థించాడు.మీరు ఏలోకంలో ఉన్నా ఎన్నికల తేదీ నాటికి చంద్రగిరి పోలింగ్ బూత్ వద్దకు వచ్చేసి ఎన్నికల్లో మీ ఓటుహక్కు వినియోగించుకోవాలని కోరాడు. మీకు రావడానికి వీలు కుదరకపోయినా నా కోసం రావాలంటూ ఓట్లు అభ్యర్థించాడు. ఇక అంతటితో ఊరుకోలేదు. ప్రతి సమాధి వద్ద వినతి పత్రం, కుక్కర్లు, వాల్‌క్లాక్‌లు ఇచ్చి తనకే ఓటు వేయాలని కోరాడు. రానూ పోనూ ఖర్చులు కూడా చెల్లిస్తానని చెప్పాడేమో మరి. అయితే ఇదంతా విని ఇదేం విడ్డూరం అని అనుకోకండి. ఇదో టైపు నిరసన కార్యక్రమం మరి.
చంద్రగిరిలో నకిలీ ఓట్లు, దొంగ ఓట్ల వ్యవహారంపై గత కొన్నిరోజులుగా వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. నకిలీ ఓట్లు చేరుస్తున్నారంటూ, అసలైన ఓట్లు తొలగిస్తున్నారంటూ రెండు పార్టీలు పరస్పరం ఆరోపించుకుంటున్నాయి. ఇక ఈ పంచాయితీ ఎన్నికల సంఘం వరకూ కూడా వెళ్లింది. అయితే నిరసన చేసిన వ్యక్తి మాత్రం మరో కారణంతో ఈ నిరసన కార్యక్రమం చేపట్టాడు. చంద్రగిరి నియోజకవర్గ ఓటర్ల జాబితాలో తప్పులు ఉన్నాయని, చనిపోయినవారి పేర్లు కూడా ఓటర్ లిస్టులో ఉన్నాయంటూ గల్లా అరుణ కుమారి అనుచరుడైన బడి సుధాయాదవ్ ఈ వినూత్న కార్యక్రమం చేపట్టాడు.
చంద్రగిరి నియోజకవర్గంల 35వేలకు పైగా దొంగ ఓట్లు ఉన్నాయని, చనిపోయిన వారి పేర్లను ఓటర్ల జాబితాలో నుంచి తీసేయాలని సుధాయాదవ్ డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. అందుకే ఈ రకంగా నిరసన వ్యక్తం చేసినట్లు చెప్పుకొచ్చాడు. మరోసారి ఆధారాలతో సహా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని.. అప్పటికైనా ఎన్నికల సంఘం అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.