గతేడాది అక్టోబరు 7 నాటి నరమేధానికి ప్రతీకారంగా గాజాలోని హమాస్ స్థావరాలను ఇజ్రాయేల్ భూస్థాపితం చేస్తోంది. గాజా కింద హమాస్ భారీ సొరంగాలు ఏర్పాటుచేసుకుని, భూగర్భ నగరాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. తాజాగా, పాలస్తీనా శరణార్థుల కోసం ఏర్పాటు చేసిన ఐక్యరాజ్యసమితికి చెందిన ‘యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ’ హెడ్‌క్వార్టర్స్ భవనాల కింద భారీ సొరంగాన్ని ఇజ్రాయేల్ సైన్యం గుర్తించింది. దీనికి సంబంధించి వీడియోను ట్విటర్‌లో షేర్ చేసిన ఐడీఎఫ్.. తమ కార్యకలాపాల కోసం ఈ సొరంగం నిర్మించిన హమాస్.. విద్యుత్ సౌకర్యం కల్పించిందని తెలిపింది. దీంతో అక్టోబర్ 7న హమాస్ మారణకాండకు ఐరాస ఏజెన్సీకి చెందిన సిబ్బంది పాత్రపై ఇజ్రాయేల్ చేస్తున్న ఆరోపణలకు మరింత బలం చేకూరినట్టయ్యింది.
ఇజ్రాయేల్‌లోకి చొరబడి హమాస్ సాగించిన నరమేధంలో ‘యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ’ ఉద్యోగుల పాత్ర ఉన్నట్లు ఇజ్రాయేల్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యూఎన్ ఏజెన్సీ కమిషనర్ జనరల్ ఫిలిప్ లజారి దాడిలో పాత్ర ఉన్నట్లు అనుమానిస్తున్న 12 మంది సిబ్బందిని తొలగించి, విచారణ చేపడతామని ప్రకటించారు. అంతేకాదు, అక్టోబరు 12 తర్వాత బేస్‌మెంట్ భాగాన్ని తాము వినియోగించడం లేదని తెలిపారు. దీంతో ఐరాస ఏజెన్సీ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసిన ఇజ్రాయేల్.. సరుకుల సరఫరాను అడ్డుకోవడమే కాదు దాని పన్ను ప్రయోజనాలను సైతం రద్దు చేసింది. అటు అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా సైతం ఏజెన్సీకి నిధుల మంజూరును నిలిపివేస్తున్నట్లు ప్రకటించడంతో ఈ సంస్థ తీవ్ర ఆర్థిక కష్టాల్లోకి జారుకుంది.
ఇక, తాజాగా బయటపడిన సొరంగాన్ని 18 మీటర్ల లోతులో మొత్తం 700 మీటర్ల పొడవుతో నిర్మించారు. విద్యుత్ సరఫరాకు ఏర్పాట్లు, సొరంగంలో బ్యాటరీలు, పరికరాలు, ఆయుధాలు, సామగ్రి, గ్రనేడ్లు, ఏజెన్సీ సర్వర్ రూమ్‌తో అనుసంధానం అయిన హమాస్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను గుర్తించినట్లు ఐడీఎఫ్ పేర్కొంది. మరోవైపు, ఈ ఘటనపై స్పందించిన యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ.. తమ కార్యాలయం కింద సొరంగం ఉందని తమకు తెలియదని పేర్కొంది. దీనిపై స్వతంత్ర విచారణ చేపడతామని, యుద్ధం కొససాగుతుండటం వల్ల దీనిపై దృష్టి సారించలేదని తెలిపింది. దాడుల నేపథ్యంలో ఇజ్రాయేల్ సైన్యం సూచనలతో తమ సిబ్బంది గాజా నగరాన్ని వీడివెళ్లారని చెప్పింది.
మేము ఆ భవనం నుంచి వెళ్లిన తర్వాత అక్కడ ఎటువంటి కార్యకలాపాలు జరుగుతున్నాయో తమకు తెలియదని వివరించింది. చివరిసారిగా గతేడాది సెప్టెంబరులో ఆ కాంపౌండ్‌లో తనిఖీలు చేసినట్టు ఓ ప్రకటన చేసింది. అక్టోబర్ 7న ఇజ్రాయేల్‌లోకి చొరబడిన హమాస్ మిలిటెంట్లు... ఊచకోతకు తెగబడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో దాదాపు 1400 మంది చనిపోగా.. మరో 250 మందిని హమాస్ బందీలుగా చేసుకుంది. దీంతో అప్పటి నుంచి ఇజ్రాయేల్.. గాజాపై వైమానిక, భూతల దాడులు కొనసాగిస్తోంది. ఇజ్రాయేల్ దాడుల్లో ఇప్పటివరకు 27,000కు పైగా పాలస్తీనా పౌరులు మరణించినట్టు ఆ దేశ ఆరోగ్యశాఖ పేర్కొంది.