పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు భారీ ఊరట లభించింది. గతేడాది మే 9 నాటి అల్లర్ల కేసులో తీవ్రవాద నిరోధక కోర్టు (ఏటీసీ )శనివారం బెయిల్ మంజూరు చేసింది. ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్‌కు నిరసనగా ఆయన మద్దతుదారులు.. సైనిక కార్యాలయాలపై దాడికి తెగబడిన ఆస్తుల ధ్వంసం చేశారు. దీంతో ఇమ్రాన్‌తో పాటు పాక్ మాజీ మంత్రి షా మొహమూద్ ఖురేషీలపై డజనుకుపైగా కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో అరెస్టయిన పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) అధినేతకు రూ.5 లక్షల పూచీకత్తుపై ఏటీసీ జడ్జి మాలిక్ ఇజాన్ అసిఫ్ బెయిల్ మంజూరు చేశారు. పాక్ సైనిక జనరల్ ప్రధాన కార్యాలయాలు, ఆర్మీ మ్యూజియమ్‌పై దాడి సహా 12 కేసుల్లో మాజీ ప్రధానికి బెయిల్ లభించినట్టు పాక్ మీడియా పేర్కొంది.
ఈ కేసుల్లో ఇమ్రాన్‌కు బెయిల్ లభించినా.. ఆయనకు జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఎందుకంటే ఇప్పటికే తోషఖానా, అధికారిక రహస్యాల లీక్ కేసుల్లో దోషిగా తేలిన ఆయనకు 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. పాక్ సార్వత్రిక ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ బలపరిచిన స్వతంత్రులు సత్తా చాటిన విషయం తెలిసిందే. పీటీఐ మద్దతుతో దాదాపు 100 మంది ఇండిపెండెంట్లు విజయం సాధించారు. ఫలితాలు వెలువడిన మర్నాడే ఇమ్రాన్‌కు ఊరట దక్కడం విశేషం. ఇక, ఇదే కేసులో షా మొహమూద్ ఖురేషీకి కూడా బెయిల్ లభించింది.
ఇద్దరినీ కోర్టు ముందు హాజరుపరచగా.. మాజీ ప్రధాని తనను మే 9న ఇస్లామాబాద్ హైకోర్టు (ఐహెచ్‌సి) ప్రాంగణంలో అక్రమంగా అరెస్టు చేశారని న్యాయమూర్తికి తెలియజేశారు. అవినీతి కేసులో అరెస్టయిన తర్వాత చెలరేగిన మే 9 నాటి హింసాకాండకు సంబంధించి ఖాన్‌పై పలు కేసులు నమోదయ్యాయి. రావల్పిండిలో నమోదైన కేసుల్లో జనరల్ హెడ్‌క్వార్టర్స్ (జిహెచ్‌క్యూ) గేటుపై దాడి, కార్యాలయంలో అల్లర్లు, ఇతర కేసులు ఉన్నాయి. ఎఫ్ఐఆర్‌లో తనపై చేసిన ఆరోపణలను ఖాన్ ఖండించారు. అంతకుముందు, అడియాలా జైలు నుంచి విడుదలైన తర్వాత ఈ దాడికి సంబంధించిన కేసులో ఖురేషీని పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు.