రాష్ట్రంలో వైసీపీ పాలనలో దళితులు దగా పడ్డారని, వారి ఆత్మగౌరవ పోరాటమే ఈ సింహగర్జన సభ అని అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ అన్నారు. రాజమహేంద్రవరం సమీపంలో వేమగిరి జాతీయ రహదారి వద్ద మైదానంలో ఆదివారం సాయంత్రం జగన్ ప్రభుత్వంపై యుద్దం ప్రకటిస్తూ ఆయన దళిత సింహగర్జన సభను నిర్వహించారు. విజయనగరం నుంచి అనంతపురం వరకు, ఆంధ్రాతోపాటు తెలంగాణా రాష్ట్రం నుంచి దళితులు హాజరయ్యారు. తొలుత బీఆర్ అంబేడ్కర్, బాబూజగ్జీవనరామ్లకు నివాళులర్పించారు. అనంతరం హర్షకుమార్ మాట్లాడుతూ పోరాడితే పోయేది లేదు.. బానిస సంకెళ్లు తప్ప అన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడం కోసం జగన్ దళితులను నమ్మించారని, క్రైస్తవులు నమ్మి జగన్ను అధికారంలోకి తీసుకువచ్చారన్నారు. అయితే మణిపూర్లో క్రైస్తవులపై మారణ కాండ సృష్టిస్తే ఈ సీఎం కనీసం స్పందించలేదని, పైగా ఆనాడు అవిశ్వాసం పెడితే కేంద్ర ప్రభుత్వానికి ఈ వైసీపీ ఎంపీలు ఓటు వేశారని గుర్తు చేసారు. దేశంలో దళితులను ఇంత నీచంగా చూసిన జగన్ లాంటి ముఖ్యమంత్రిని ఎన్నడూ చూడలేదన్నారు.