ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజల సొమ్మును అప్పనంగా ఇతరులకు ఎలా కట్టబెడతారని ప్రశ్నించారు. యాత్ర-2 సినిమా తీసిన దర్శకుడు మహి వి రాఘవకు భూమి కేటాయించడాన్ని తప్పు పట్టారు. తన సొంత డబ్బా కొడితే సొంత భూమి ఇవ్వాలని సూచించారు. అలా కాకుండా ప్రభుత్వ భూమిని ఎలా కట్టబెడతారని సీపీఐ రామకృష్ణ ప్రశ్నించారు. మాజీ సీఎం వైఎస్ఆర్ జీవిత చరిత్ర ఆధారంగా యాత్ర సినిమాను మహి వి రాఘవ తెరకెక్కించారు. ఆ మూవీ కంటిన్యూగా తీసిన యాత్ర-2 మూవీ ఇటీవల విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ప్రేక్షకులు ముందుకు వచ్చింది. సినిమా తీసిన దర్శకుడు రాఘవకు హార్స్‌లీ హిల్స్‌లో 2 ఎకరాల భూమిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయించింది. ఆ భూమి విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.20 కోట్ల వరకు ఉంటుంది. దర్శకుడు రాఘవ మీద సీఎం జగన్‌కు అభిమానం ఉంటే ఇడుపుల పాయలో భూమి కేటాయించాలని రామకృష్ణ సూచించారు. అలా కాకుండా ప్రజల ఆస్తిని ఎలా కేటాయిస్తారని అడిగారు. రాఘవ తప్పా మీకు సినీ పరిశ్రమ కనిపించడం లేదా అని అడిగారు. ఆ స్థలాన్ని గత ప్రభుత్వం క్రీడా శిక్షణ కేంద్రం ఏర్పాటు కోసం కేటాయించిందని గుర్తుచేశారు.