జగన్ ఐదేళ్ల పాలనలో మోసపోయినట్లు ప్రజలు గుర్తించారని, అందుకే ప్రస్తుతం ఎక్కడ చూసినా ‘సైకో పోవాలి.. సైకిల్ రావాలి’ అన్న నినాదాలు వినిపిస్తున్నాయని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. లోకేశ్ శంఖారావం సభలో ఆయన మాట్లాడుతూ.. జాబ్ క్యాలెండర్ ఏమైందని ప్రశ్నించారు. కేవలం ఎన్నికలు ఉన్నాయనే డీఎస్సీ ప్రకటించారని ఎద్దేవా చేశారు. ‘పలాసలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఎక్కడా తట్టెడు మట్టి కూడా మంత్రి అప్పలరాజు వేయలేదు. కొండలు కబ్జా చేసిన ప్రాంతంలో ఆయన సెల్ఫీలు తీసుకోవాలి. అడుగడుగునా మంత్రి అవినీతికి పాల్పడి పలాస పరువు తీశారు. స్టీలు కుర్చీల ఎంపీ అని నన్ను తూలనాడారు. వాస్తవానికి ఇక్కడి నుంచి స్టీల్‌ప్లాంట్ వరకు నేనే ఎంపీనన్న విషయం మంత్రి గుర్తించాలి. వైసీపీ ఎంపీలు ఎవరో రాష్ట్ర ప్రజలకు ఇప్పటివరకు తెలియదు. బాబాయ్‌ను హత్య చేసిన, భూ కబ్జాలకు పాల్పడిన, అశ్లీల వీడియోలు తీసుకున్న ఎంపీలు అంటేనే ప్రజలకు తెలుసు. వైసీపీ సోషల్ మీడియాలో తప్ప పలాస కిడ్నీ ఆసుపత్రి ఎవరికీ వినియోగపడడం లేదు. నెఫ్రాలజిస్ట్‌లు లేని కిడ్నీ ఆసుపత్రులను ఏర్పాటు చేశారు. మంత్రి కేవలం పబ్లిసిటీ కోసమే బిల్డింగ్‌లు కట్టి బిల్డప్ ఇస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎర్రన్నాయుడు ఉద్దానం రక్షితనీటి పథకం అమలు చేస్తే.. నారా లోకేశ్‌కు ఉద్దానం ప్రాంతాలకు శుద్ధ జలాలు అందించిన చరిత్ర ఉంది. ప్రస్తుతం రూ.700 కోట్లతో ప్రారంభించిన నీటి పథకం ద్వారా ఒక్క గ్రామానికైనా పూర్తిస్థాయి నీరు అందించారా?. పలాస అభివృద్ధి చెందాలంటే గౌతు శిరీషను గెలిపించాలి’ అని ఎంపీ కోరారు.