రామాయణం, మహాభారతం అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువులకు ఎంతో పవిత్రమైనవి. వేల ఏళ్ల క్రితం జరిగిన ఈ పురాణాలను ఇప్పటికీ మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఎంతో భక్తితో కొలుస్తారు. హిందూ మతం మాత్రమే కాకుండా చాలా మతాలు, దేశాలు కూడా రామాయణ, మహాభారత గ్రంథాలను తర్జుమా చేయించుకుని చదువుతారు. అలాంటి పవిత్రమైన గ్రంథాలకు వ్యతిరేకంగా ఓ పాఠశాలలోని టీచర్ పాఠాలు చెప్పడం ప్రస్తుతం సంచలనంగా మారింది. అసలు రామాయణం, మహాభారతం వంటివి చరిత్రలో జరగలేదని.. అవన్నీ అభూత కల్పనలేనని పేర్కొనడం తీవ్ర దుమారానికి దారి తీసింది. ఈ సంఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.
మంగళూరులోని సెయింట్ జెరోసా ఇంగ్లీష్ హెచ్‌ఆర్ ప్రైమరీ స్కూల్‌లో ఈ సంఘటన జరిగింది. హిందూ దేవుళ్లను అవమానించడమే కాకుండా హిందూ పురాణాల గురించి తప్పుగా పిల్లలకు ఓ టీచర్ నేర్పిస్తున్నట్లు విద్యార్థులు ఇచ్చిన సమాచారంతో భజరంగ్ దళ్, వీహెచ్‌పీ సభ్యులు ఆ స్కూల్ ముందు తీవ్ర నిరసన చేపట్టారు. వీరికి స్థానిక బీజేపీ ఎమ్మెల్యే వేదవ్యాస్ కామత్ కూడా తోడయ్యారు. దీంతో ఆ పాఠశాల వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హిందూ మతానికి వ్యతిరేకంగా విద్యార్థుల మనస్సులను విషపూరితం చేయడం, ఇతర మతాలకు చెందిన విద్యార్థులను క్రైస్తవ మతంలోకి మార్చడానికి కుట్ర పన్నుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు, హిందూ సంఘాల నేతలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు.
ఇవే కాకుండా 2002 గుజరాత్ అల్లర్లు, గోద్రా ఘటన, బిల్కిస్ బానోకు సంబంధించి విద్యార్థులకు తప్పుడు సమాచారం ఇస్తున్నారని పేర్కొన్నారు. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కూడా వ్యతిరేకంగా ఆ టీచర్ విద్యార్థులకు బోధిస్తున్నట్లు గుర్తించారు. రాముడు పౌరాణిక వ్యక్తి అని ఉపాధ్యాయుల్లో ఒకరు చెప్పారని.. రామాయణం, మహా భారతం లాంటి పురాణాలు ఒట్టి కల్పితాలు మాత్రమేనని చెప్పడం సంచలనంగా మారింది. ఎమ్మెల్యే వేదవ్యాస్ కామత్, భజరంగ్ దళ్, వీహెచ్‌పీ సభ్యులు పాఠశాల వద్దకు చేరుకుని యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు. ఆ టీచర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేయాలని డిమాండ్ చేయడంతో యాజమాన్యం తొలగించింది. మరోవైపు.. ఈ ఘటనపై దృష్టి సారించిన మంగళూరు డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్‌స్ట్రక్షన్ విచారణ చేపట్టారు.
పరిస్థితి తీవ్రంగా మారుతుండటంతో సెయింట్ జెరోసా స్కూల్ యాజమాన్యం స్పందించింది. తాము పాఠశాల ప్రారంభించి 60 ఏళ్లు గడుస్తోందని.. ఇలాంటి సంఘటన ఇప్పటివరకు చోటు చేసుకోలేదని పేర్కొంది. ఇలాంటి దురదృష్టకరమైన సంఘటన తమ పాఠశాలపై నమ్మకాన్ని పోగొట్టేలా ఉందని.. అయితే అందరి సహకారంతో ఆ నమ్మకాన్ని తిరిగి కల్పిస్తామని పేర్కొంది. తమ పాఠశాల విద్యార్థుల మంచి భవిష్యత్తు కోసం అందరితో కలిసి పని చేస్తామని ప్రకటన విడుదల చేసింది.