గుంటూరు జిల్లా తెనాలి గంగానమ్మపేటలో వివాహిత దారుణ హత్యకు గురైంది. స్థానిక తమ వీధిలోని ఓ భవనంలో నివాసం ఉంటున్న రామిశెట్టి అలేఖ్య(35)ను గుర్తుతెలియని వ్యక్తులు గొంతుకోసి హత్య చేశారు. గురువారం ఉదయం తన గదిలో రక్తపు మడుగులో పడి ఉన్న అలేఖ్య మృతదేహాన్ని గుర్తించిన ఆమె భర్త రమేష్ వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. టూటౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
గత కొన్నాళ్లుగా అన్నెం శ్రీనివాస్ అనే వ్యక్తి తన భార్యను వేధిస్తున్నాడని మృతురాలి భర్త రమేష్ పోలీసులకు తెలిపాడు. శ్రీనివాస్ నా భార్యను తరచూ వేధించేవాడు. ఆమెను హత్య చేసేందుకు కూడా ప్రయత్నించాడు. మమ్మల్ని చంపేస్తానని చాలాసార్లు బెదిరించాడు. అతనిపై కేసులు పెట్టాం. శిక్ష పడే అవకాశం ఉండడంతో ఇలా చేశాడు. బెదిరింపులకు దిగుతాడని అనుకున్నాం.. కానీ ఇంత హింసాత్మక చర్యకు పాల్పడతాడని అనుకోలేదు’’ అని రమేష్ పోలీసులకు వివరించారు.