ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరో రెండు నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశాలు ఉండగా.. ఏ తేదీన ఎన్నికలు జరుగుతాయనే దానిపై వివిధ రకాల కథనాలు వెలువడుతున్నాయి. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో అనేక వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏపీ ఎన్నికలు జరిగేది ఈ తేదీల్లోనే ఆంటూ నెట్టింట కొన్ని తేదీలు చక్కర్లు కొడుతున్నాయి. ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి పేరిట ఈ ప్రకటనలు కనిపిస్తున్నాయి.
మార్చి 12 వ తేదీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందని, మార్చి 28వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుందని అందులో ఉంది. అలాగే ఏప్రిల్ 19న ఎన్నికలు జరుగనున్నట్లు అందులో ఉంది. ఇక ఫలితాలు మాత్రం మే 22న వెలువడుతాయట. మే నెల 30 కల్లా కొత్త ప్రభుత్వం కొలువుదీరుతుందంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.
అయితే ఈ వైరల్ న్యూస్ మీద ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా క్లారిటీ ఇచ్చారు. అదంతా ఫేక్ న్యూస్ అని కొట్టిపారేశారు. సోషల్ మీడియాలో ప్రచారమయ్యే ఇలాంటి వార్తలను పట్టించుకోవద్దని సూచించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి పేరుతో సోషల్ మీడియాలో ఎన్నికల షెడ్యూలు ట్రోల్ అవ్వడాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల కార్యాలయం ఖండిస్తున్నట్లు చెప్పారు. ఈ ఫేక్ న్యూస్ తో తమ కార్యాలయానికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ ప్రకటన విడుదల చేశారు. ఫేక్ న్యూస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.