మరో రెండు నెలల్లో ఏపీలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో.. అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారం ప్రారంభించాయి. సభలు, సమీక్షలు, సమావేశాలు, పంచు డైలాగులతో హోరెత్తిస్తున్నాయి. ఇక టీడీపీతో జట్టుకట్టిన జనసేన సైతం ఈసారి ఎలాగైనా సత్తాచాటాలనే లక్ష్యంతో తహతహలాడుతోంది. అయితే ఇప్పటి వరకూ ఓ విషయంలో మాత్రం జనసేన క్లారిటీ ఇవ్వలేకపోతోంది. వైసీపీ అధినేత జగన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారంటే పులివెందుల అనే సమాధానం వస్తుంది. ఇక టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు విషయానికి వస్తే కుప్పం అని ఆన్సర్ వస్తుంది. మరి జనసేనాని సంగతి ఏంటంటే.. ఇప్పటికైతే సమాధానం దొరకని ప్రశ్నే. ఈ విషయంపైనే వైసీపీ శ్రేణుల నుంచి పవన్ కళ్యాణ్ విమర్శలు ఎదుర్కొంటున్నారు.
అయితే వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి బరిలో దిగాలనే దానిపై పవన్ కళ్యాణ్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. 2019 ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరం నుంచి పోటీ చేశారు. అయితే రెండు చోట్లా జనసేనానికి ఓటమే ఎదురైంది. అయితే ఈసారి పక్కా ప్రణాళికతో వెళ్లాలని పవన్ భావిస్తున్నారట. పవన్ కళ్యాణ్ పోటీ ఇక్కడి నుంచే చేస్తారంటూ తిరుపతి, కాకినాడ, గాజువాక, భీమవరం, భీమిలి నియోజకవర్గాల పేర్లు వినిపించాయి. కానీ జనసేనాని మాత్రం ఈసారి భీమవరం నుంచే బరిలో దిగే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. తాజాగా భీమవరంలో పవన్ కళ్యాణ్ ఉండేందుకు ఇంటి కోసం జనసేన శ్రేణులు వెతుకుతున్నట్లు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో పవన్ ఇక్కడి నుంచే పోటీచేస్తారనే ప్రచారానికి ఇది బలం చేకూరుస్తోంది.
అయితే పవన్ కళ్యాణ్ కోసం భీమవరంలో ఇల్లు వెతకడం వెనుక మరో కారణం కూడా ఉందని విశ్లేషకులు అంటున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీచేసిన గ్రంధి శ్రీనివాస్.. పవన్ కళ్యాణ్ మీద విజయం సాధించారు. అయితే పవన్ కళ్యాణ్ నాన్ లోకల్ అంటూ శ్రీనివాస్‌తో పాటుగా వైసీపీ శ్రేణులు పదే పదే విమర్శలు చేస్తున్నాయి. ఈ విమర్శలకు తావివ్వకూడదనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ భీమవరంలో ఇంటికోసం వెతుకుతున్నట్లు తెలిసింది.
మరోవైపు ఫిబ్రవరి 20వ తేదీన పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటనకు వెళ్లనున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ పర్యటన ఫిబ్రవరి 14నే జరగాల్సి ఉంది. అయితే హెలికాప్టర్ ల్యాండింగ్‌కు అధికారుల నుంచి అనుమతి రాకపోవటంతో పవన్ కళ్యాణ్ ఉభయగోదావరి జిల్లాల పర్యటన వాయిదా పడింది. ఇక భీమవరంలో పవన్ పోటీ చేస్తారనే ప్రచారంలో ఆ నియోజకవర్గంలోని జనసైనికులు సంబరాలు చేసుకుంటున్నారు.