ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బ్యాలెట్‌ పేపర్లపై ఎక్స్ మార్క్ ఎందుకు పెట్టారు.. చండీగఢ్ రిటర్నింగ్ ఆఫీసర్‌పై సుప్రీం సీరియస్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 19, 2024, 11:49 PM

ప్రస్తుతం చండీగఢ్ మేయర్ ఎన్నిక తీవ్ర దుమారం రేపుతోంది. గత నెల 30 వ తేదీన జరిగిన చండీగఢ్ మేయర్ ఎన్నిక వ్యవహారం కోర్టుకు ఎక్కడంతో.. విచారణ జరిపిన సీజేఐ.. రిటర్నింగ్ అధికారి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్ ఎన్నిక సందర్భంగా బ్యాలెట్ పేపర్లపై ఎందుకు ఎక్స్ మార్క్‌లు పెట్టారంటూ ప్రశ్నించారు. అయితే ఆ అధికారి చెప్పిన సమాధానం పట్ల సంతృప్తి చెందని.. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ అబద్ధం చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. మరోవైపు.. చండీగఢ్ మేయర్ ఎన్నిక వివాదం గురించి సుప్రీంకోర్టులో విచారణకు ముందే మేయర్‌గా ఎన్నికైన వ్యక్తి రాజీనామా చేయడం.. ముగ్గురు ఆప్ కౌన్సిలర్లు బీజేపీలోకి చేరడం వంటి ఘటనలు జరగడం తీవ్ర సంచలనంగా మారింది.


చండీగఢ మేయ‌ర్ ఎన్నిక స‌మ‌యంలో రిటర్నింగ్ అధికారిగా అనిల్ మాషి ఉన్నారు. అయితే బ్యాలెట్ పేపర్లు లెక్కించే సమయంలో ఆ పేపర్లపై రిటర్నింగ్ అధికారి అనిల్ మాషి.. ఎక్స్ మార్క్ పెట్టడం పెను దుమారం రేపింది. అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాను చూస్తూ.. అనిల్ మాషి ఆ బ్యాలెట్ పేపర్లను కొట్టివేయడం సంచలనం అయింది. ఈ క్రమంలోనే చండీగఢ్‌ కౌన్సిల్‌లో అత్యధిక బలం ఉన్న ఆప్ మేయర్ అభ్యర్థి కాదని.. కౌన్సిలర్ల బలం లేని బీజేపీ అభ్యర్థికి మేయర్ పీఠం దక్కడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆప్ కౌన్సిలర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో సీజేఐ విచారణ చేపట్టి రిటర్నింగ్ అధికారిపై సీరియస్ అయ్యారు.


బ్యాలెట్ పేప‌ర్లను లెక్కించాల్సిన స‌మ‌యంలో.. వాటిపై ఎక్స్ మార్క్‌లు ఎందుకు పెట్టారని రిటర్నింగ్ ఆఫీస‌ర్‌ను జ‌స్టిస్ డీవై చంద్రచూడ్ ప్రశ్నించారు. ఒక‌వేళ కోర్టుకు ఏదైనా అబ‌ద్దం చెప్పాల‌ని ప్రయ‌త్నిస్తే ప్రాసిక్యూషన్ చేయాల్సి ఉంటుందని సీజేఐ హెచ్చరించారు. ఈ సందర్భంగా సీసీటీవీ కెమెరాను చూస్తూ ఎందుకు మార్క్ చేశారని ప్రశ్నించారు. అయితే తాను సరిగా లేని బ్యాలెట్ పేప‌ర్లకు మార్కింగ్ చేసినట్లు తెలిపారు. ఆ స‌మ‌యంలో కౌన్సిల్‌లో ఉన్న సభ్యులు కెమెరా, కెమెరా అని అరిచారని అందుకే చూసినట్లు కోర్టుకు విన్నవించారు.


అయితే మొత్తం 8 బ్యాలెట్ పేప‌ర్లపై తాను మార్కింగ్ చేసిన‌ట్లు వెల్లడించారు. అయితే వాటిని వేరు చేయాల‌న్న ఉద్దేశంతోనే అలా చేసినట్లు తెలిపారు. కానీ రిట‌ర్నింగ్ ఆఫీస‌ర్ అనిల్ మాషి ఇచ్చిన స‌మాధానంతో సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ సంతృప్తి చెంద‌లేదు. బ్యాలెట్ పేప‌ర్లను లెక్కించాలి కానీ ఎక్స్ మార్కులు పెట్టడం ఎందుకని ప్రశ్నించారు. అంతే కాకుండా ఏ రూల్ ప్రకారం అలా చేశార‌ని.. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారిని ప్రాసిక్యూట్ చేయాల్సి ఉంటుందని.. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాటిని చోటు లేద‌ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు.


చండీగఢ్ మేయ‌ర్ ఎన్నికపై స్టే ఇవ్వాల‌ని కోరుతూ ఆప్ కౌన్సిల‌ర్ కుల్దీప్ కుమార్ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌పై సోమవారం సుప్రీంకోర్టులో విచార‌ణ జరిగింది. సీజేఐ డీవై చంద్రచూడ్‌, జ‌స్టిస్ జేబీ ప‌ర్దివాలా, జస్టిస్ మ‌నోజ్ మిశ్రాల‌తో కూడిన త్రిసభ్య ధ‌ర్మాస‌నం విచారించింది. ఆ మేయర్ ఎన్నిక‌లో బీజేపీ అభ్యర్థి మేయ‌ర్‌గా ఎన్నిక కాగా.. సుప్రీంకోర్టులో విచారణకు ముందు మేయ‌ర్‌గా ఎన్నికైన వ్యక్తి ఆదివారం రాజీనామా చేశారు.


ఇక కోర్టు విచారణకు ముందే ముగ్గురు ఆప్ కౌన్సిల‌ర్లు బీజేపీలో చేరడం సంచలనంగా మారింది. అయితే ఇలా ఒక పార్టీలో గెలిచిన వారు ఎన్నికల తర్వాత మరో పార్టీలో చేరడం పట్ల సీజేఐ డీవై చంద్రచూడ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. హార్స్ ట్రేడింగ్ అంశం చాలా తీవ్రమైన అంశమని.. అభ్యర్థులు పార్టీలు మార‌డం క‌లిచివేస్తోంద‌ని తెలిపారు. ఈ క్రమంలనే హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ కస్టడీలో ఉన్న బ్యాలెట్‌ పేపర్లను తమ ముందు ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం కూడా విచారణకు హాజరు కావాలని రిటర్నింగ్ అధికారి అనిల్ మాషీని కోర్టు ఆదేశించింది. బ్యాలెట్ పేపర్లు, ఓట్ల లెక్కింపు పూర్తి వీడియో రికార్డింగ్‌ను సుప్రీంకోర్టు సమీక్షించనుంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com