కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్.. కమలం తీర్థం పుచ్చుకుంటున్నారనే వార్తలు ఇటీవల గుప్పుమన్నాయి. కమల్ నాథ్ కుమారుడు నకుల్ నాథ్.. తన సోషల్ మీడియా అకౌంట్ బయోలో కాంగ్రెస్ పార్టీ పేరు తొలగించడం.. ఆ తర్వాత కమల్ నాథ్ ఢిల్లీలో పర్యటించడంతో ఆయన బీజేపీలో చేరనున్నారనే ఊహాగానాలకు బలం చేకూర్చాయి. అయితే కమల్ నాథ్ మాత్రం.. తాను కాంగ్రెస్‌ను విడిచిపెట్టే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. పార్టీ మారే పరిస్థితులు వస్తే ముందుగా మీడియాకే చెబుతానని స్పష్టం చేశారు. అయినా కమల్ నాథ్ కమలంలోకి వెళ్తున్నారనే వార్తలకు చెక్ పడలేదు. ఈ క్రమంలోనే తాజాగా తన ఇంటిపై ఉన్న జై శ్రీరాం జెండాను కమల్ నాథ్ తొలగించడం తీవ్ర చర్చకు దారి తీసింది.
అయితే బీజేపీలో చేరికపై కమల్ నాథ్ యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో పర్యటిస్తున్న కమల్ నాథ్.. సోమవారం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీలతో భేటీ అయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని వెల్లడించినట్లు సమాచారం. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవాన్ని చవి చూసింది. దీంతో మాజీ సీఎంగా ఉన్న కమల్ నాథ్‌ను.. పీసీసీ చీఫ్ పదవి నుంచి అధిష్ఠానం తొలగించింది. ఈ నిర్ణయం పట్ల తీవ్ర అసంతృప్తిగా ఉన్న కమల్ నాథ్.. తన కుమారుడు నకుల్ నాథ్‌తో కలిసి బీజేపీలోకి వెళ్తారనే ప్రచారం జోరుగా జరిగింది.
ఈ ఊహాగానాల వేళ.. కమల్ నాథ్ కుమారుడు నకుల్ నాథ్.. తన సోషల్ మీడియా ఖాతాలో బయో నుంచి కాంగ్రెస్ పార్టీ పేరును తొలగించడంతో వార్తలు గుప్పుమన్నాయి. దీనికితోడు ఢిల్లీకి వెళ్లిన కమల్ నాథ్.. పలువురు బీజేపీ పెద్దలను కలుస్తారనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే కమల్ నాథ్.. కమలంలో చేరడం ఖాయమేననే వార్తలు వచ్చాయి.
అయితే తాజాగా ఈ ఊహాగానాలకు తెరపడింది. కమల్ నాథ్ ఏ పార్టీలో చేరడం లేదని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జితేంద్ర సింగ్ ఆదివారం సాయంత్రం తెలిపారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న జీతూ పట్వారి కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరించారు. ఇది కమల్ నాథ్‌పై జరిగిన కుట్ర అని.. తాను కమల్ నాథ్‌తో మాట్లాడినట్లు తెలిపారు. ప్రస్తుతం వస్తున్న వార్తలన్నీ వదంతులు మాత్రమేనని.. తాను కాంగ్రెస్ వ్యక్తిని అని.. చివరి వరకు కాంగ్రెస్ భావజాలాన్ని కొనసాగిస్తానని కమల్ నాథ్ చెప్పారని.. జీతూ పట్వారీ స్పష్టం చేశారు.
ఈ క్రమంలోనే ఢిల్లీలోని కమల్ నాథ్ నివాసంపై ఉన్న జై శ్రీరాం జెండాను తొలగించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో కమల్ నాథ్ చేరుతారని ప్రచారం జరుగుతున్న వేళ.. ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. ఆదివారం నుంచి ఆయన నివాసంపై ఉన్ జై శ్రీరాం జెండా ప్రస్తుతం లేకపోవడం మరిన్ని ఊహాగానాలకు తావిస్తోంది.