కేంద్ర ప్రభుత్వంతో రైతులు, రైతు సంఘాలు జరిపిన చర్చలు సఫలం కావడంతో అన్నదాతలు తమ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇల్లు, వాకిలి వదిలేసి రోడ్లపైకి వచ్చి ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. ఎలాగైనా ఈసారి తమ డిమాండ్లు సాధించేవరకు వెనక్కి తగ్గేది లేదు అంటూ భీష్మించుకు కూర్చుంటున్నారు. అయితే ఈ క్రమంలోనే పలువురు అన్నదాతలు ప్రాణాలు విడుస్తున్నారు. ఇప్పటివరకు ముగ్గురు రైతులు చనిపోవడం.. మిగితా రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. తాజాగా పంజాబ్‌లో ఒక రైతు గుండెపోటుతో మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
పంజాబ్‌లోని పటియాలాకు చెందిన 45 ఏళ్ల నరీందర్ పాల్ గుండెపోటుతో మరణించారు. పటియాలా జిల్లాలోని బతోని కాలన్ గ్రామానికి చెందిన నరీందర్ పాల్.. భారత్ కిసాన్ యూనియన్ ఏక్తా ఉగ్రహన్ అనే రైతు సంఘం కింద ఆందోళనల్లో పాల్గొన్నాడు. పటియాలాలోని పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ నివాసం వద్ద ఆదివారం రాత్రి చేస్తున్న నిరసనలకు నరీందర్ పాల్ హాజరయ్యాడు. ఈ క్రమంలోనే తీవ్ర అస్వస్థతకు గురైన నరీందర్ పాల్.. ఆ విషయాన్ని తోటి రైతులకు చెప్పాడు. తనను ఇంటికి తీసుకెళ్లాలని వారికి చెప్పగా.. మార్గమధ్యలో పరిస్థితి విషమించింది.
దీంతో వెంటనే నరీందర్ పాల్‌ను దగ్గర్లో ఉన్న ప్రభుత్వ రాజీంద్ర హాస్పిటల్‌కు తరలించారు. అయితే అప్పటికే నరీందర్ పాల్ చనిపోయినట్లు డాక్టర్లు గుర్తించారు. గుండెపోటు రావడంతోనే నరీందర్ పాల్ మృతి చెందాడని డాక్టర్లు తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే అతని మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచినట్లు తెలిపారు. త్వరలోనే పోస్టు మర్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని పేర్కొన్నారు.
నరీందర్ పాల్‌కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. వారికి రూ.10 లక్షల అప్పు ఉన్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని.. రైతు సంఘం నేత దల్‌బార సింగ్ చాజ్లా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రూ.10 లక్షల పరిహారం, నరీందర్ పాల్ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగంతోపాటు అతనికి ఉన్న రూ.10 లక్షల అప్పును మాఫీ చేయాలని తెలిపారు.
ఇక ఈసారి చేపట్టిన రైతు ఆందోళనల్లో ఇప్పటివరకు ముగ్గురు చనిపోయారు. ఇప్పుడు నరీందర్ పాల్ మృతి చెందగా.. ఇంతకు ముందు పంజాబ్-హర్యానా సరిహద్దుల్లోని శంభు వద్ద ఒకరు.. ఖానౌరీ వద్ద మరొకరు ప్రాణాలు కోల్పోయారు. ఆందోళన చేస్తున్న రైతులు చనిపోతుండటంతో మిగిలిన రైతుల్లో భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి.