స్వాతంత్య్రం వచ్చి 77 ఏళ్లు పూర్తయినా ఇంకా దేశంలోని కొన్ని ప్రాంతాలు.. జనజీవన స్రవంతిలో కలవకుండా ఉన్నాయి. అందులో కొన్ని గిరిజన, ఆదివాసీ గూడాలు ఉండగా.. మరికొన్ని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి జాతీయ జెండా ఎగరని ఒక ఊరిలో తాజాగా మువ్వన్నెల పతాకం ఎగిరింది. దీంతో ఆ గ్రామస్థులు ఆనందంతో సంబరాలు చేసుకుంటున్నారు. అయితే అది మావోయిస్టుల చెరలో ఉన్న గ్రామం కావడం గమనార్హం. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలోని పువర్తి గ్రామం ఇప్పుడు వార్తల్లో నిలిచింది.
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఆ పువర్తి గ్రామంలో జెండా ఎగిరింది. ఇది మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతమైన ఈ పువర్తి.. మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా స్వగ్రామం కావడం గమనార్హం. ఇక ఆ గ్రామంలో ప్రభుత్వానికి సమాంతరంగా మావోయిస్టులు ప్రభుత్వాన్ని నడిపేవారు. దీంతో ఆ ప్రాంతంలోకి వెళ్లాలంటేనే పోలీసులు వెనక్కి తగ్గేవారు. ఇక హిడ్మా కోసం పోలీసులు ఎన్నో ఆపరేషన్లు చేపట్టినా.. వాటి నుంచి తప్పించుకుని పోలీసులకు సవాల్ విసిరేవాడు.
ఈ క్రమంలోనే పువర్తి చుట్టు పక్కల పోలీస్ చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తూ క్రమంగా ముందుకెళ్లిన భద్రతా బలగాలు చివరికి ఆ గ్రామంలోకి వెళ్లి అక్కడ జెండా ఎగురవేశాయి. దీంతో స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత తొలిసారి అక్కడ మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. బస్తర్ ప్రాంతంలో తరచూ భద్రతా బలగాలపై అత్యంత వ్యూహాత్మకంగా, భీకర దాడులకు హిడ్మా పాల్పడేవాడు. ఈ క్రమంలోనే వామపక్ష తీవ్రవాదం అణచివేతకు భద్రతా బలగాలు తీసుకుంటున్న చర్యల్లో హిడ్మా గ్రామం వద్ద పోలీసు చెక్‌పోస్టు ఏర్పాటు చేయడం అత్యంత కీలక పరిణామంగా మారింది.
ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుటికీ మావోయిస్టులు చెరలో ఉన్న పువర్తి గ్రామంలో తొలిసారి జాతీయ జెండా ఎగురవేయడంతో స్థానికులు సంబరాలు జరుపుకున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు, భద్రతా బలగాలకు వ్యతిరేకంగా.. మావోయిస్టులు భారీ దాడులు చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే భద్రతా దళాల తనిఖీలో పలువురు మావోయిస్టులు పట్టుబడ్డారు. అయితే వారిని అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీసులు.. గ్రామంలో జెండా ఎగరవేయడానికి సిద్ధం అయ్యారు. ఈ క్రమంలోనే పువర్తి గ్రామంలో సోమవారం జాతీయ జెండా ఎగురవేసి అక్కడి ప్రజలకు స్వేచ్ఛను అందించారు. అంతేకాకుండా తమ అవసరాల కోసం మావోయిస్టులు కూరగాయలు పండించే భూములను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఆ పువర్తి గ్రామం, చుట్టు పక్కల ప్రాంతం మావోయిస్టులకు శిక్షణ ఇచ్చే శిబిరంగా ఉండేది. సమావేశాలు నిర్వహించుకోవడంతోపాటు స్థానిక యువకులను నక్సలిస్టులుగా మార్చి వారికి శిక్షణ ఇచ్చేవారు. ఈ క్రమంలోనే ఒకప్పుడు పోలీసులు అడుగు పెట్టడానికి భయపడే ఆ ప్రాంతంలో.. గత కొన్ని నెలలుగా పలు పోలీసులు శిబిరాలు ఏర్పాటు చేశారు.