షోరూంలలో బైక్‌లను కొనుగోలు చేసేవారిని నిత్యం మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. అయితే డబ్బులు మొత్తం ఒకేసారి చెల్లించేవారు ఉంటారు.. ముందు కొన్ని డబ్బులు చెల్లించి.. ఈఎమ్ఐ సౌకర్యం వాడుకునేవారు కూడా ఉంటారు. ఇక రూ.1, రూ.2, రూ.5 నాణేలను బస్తాల్లో తీసుకువచ్చి.. తమకు ఇష్టమైన బైక్‌లను కొనుగోలు చేసిన వారి గురించి మనం ఇప్పటికే విన్నాం. తాజాగా అలాంటిదే మరో సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి అన్నీ రూ.10 నాణేలతో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేశాడు. అయితే ఆ స్కూటర్ ధర రూ.1 లక్షకు పైగా ఉండటం గమనార్హం. ఈ విషయాన్ని కంపెనీ సీఈఓ వెల్లడించారు.
ఈ సంఘటన రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో చోటు చేసుకుంది. ఒక వ్యక్తి స్థానికంగా ఉన్న ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ల షోరూంకు వెళ్లాడు. అక్కడ ఏథర్ 450 మోడల్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలని చెప్పాడు. అయితే ఆ స్కూటర్ ధర రూ.1,09,947 నుంచి రూ. 1,44,871 మధ్య ఉంది. దీంతో తన వద్ద ఉన్న చిల్లర నాణాలతో కూడిన సంచులను ఆ షోరూంలో కుమ్మరించాడు. అందులో మొత్తం రూ.10 నాణాలే ఉండటం విశేషం. అయితే ఆ స్కూటర్‌కు అయ్యే డబ్బును మొత్తం ఆ కస్టమర్.. రూ.10 నాణేలు చెల్లించడం గమనార్హం.
అయితే ఈ విషయాన్ని ఏథర్ ఎనర్జీ కంపెనీ సీఈఓ తరుణ్ మెహతా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఆ కస్టమర్‌కు ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ తాళాలు ఇస్తున్న ఫోటోను షేర్ చేసిన తరుణ్ మెహతా.. కొత్త ఏథర్ యజమాని అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఇక ఈ విషయంపై ట్వీట్ చేసిన తరుణ్ మెహతా.. ఏథర్ 450 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేసేందుకు వచ్చిన జైపూర్ కస్టమర్.. మొత్తం రూ.10 కాయిన్లు ఇచ్చారని తెలిపారు. ఆ కస్టమర్ తెచ్చిన రూ.10 నాణేలకు సంబంధించిన సంచులు కూడా ఆ ఫోటోలో కనిపిస్తున్న టేబుల్‌పై ఉండటం గమనార్హం.
అయితే ఏథర్ 450 ఎలక్ట్రిక్ స్కూటర్‌లోని ఏ మోడల్‌ను ఆ కస్టమర్ కొనుగోలు చేశాడు అనే విషయాన్ని మాత్రం తరుణ్ మెహతా వెల్లడించలేదు. ఏథర్ 450 సిరీస్‌లో మొత్తం 3 మోడల్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉన్నాయి. ఏథర్ 450 అపెక్స్, ఏథర్ 450 ఎక్స్, ఏథర్ 450 ఎస్. వీటి ధరలు మోడల్‌ను బట్టి.. రూ.1.10 లక్షల నుంచి రూ. 1.45 లక్షల మధ్య ఉన్నాయి. ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆన్‌రోడ్ ధర రూ. 1.75 లక్షలు ఉంటుందని ఏథర్ సంస్థ తెలిపింది.