తమిళనాడు రాష్ట్ర చరిత్రలో ఓ గిరిజన యువతి తొలిసారి సివిల్ జడ్జిగా ఎంపికయ్యింది. సివిల్ జడ్జిగా ఎంపికైన 23 ఏళ్ల శ్రీపతిని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అభినందించారు. తన లక్ష్యాన్ని చేరుకోవడంలో శ్రీపతి అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. పరీక్షకు రెండు రోజుల ముందే ఓ బిడ్డకు జన్మనిచ్చిన ఆమె.. వైద్యులు ప్రమాదమని వారించినా ధైర్యం చేసింది. రెండు రోజుల పసికందుతో తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన సివిల్ జడ్జ్ పరీక్షకు హాజరయ్యింది.. ఈ ఫలితాలు ఇటీవల విడుదల కాగా.. శ్రీపతి ఉద్యోగానికి ఎంపికై చరిత్ర సృష్టించింది.
చెన్నైకి 250 కిలోమీటర్ల దూరంలోని తిరువన్నామలై దగ్గరి జువ్వాది పర్వతశ్రేణుల మధ్య గిరిజన గూడెం తురింజికుప్పం శ్రీపతిది. తండ్రి కాళిదాస్ , తల్లి మల్లిగ కొండప్రాంతంలో పోడు వ్యవసాయం చేసేవాళ్లు .ఆమెకు చెల్లెలుచ తమ్ముడు ఉన్నారు. అయితే, పిల్లల చదువుల కోసం కాళిదాస్ కుటుంబం దగ్గరలోని అత్నవర్‌పల్లెకు వలస వచ్చింది. ఇక్కడా పోడు వ్యవసాయం అయినా పిల్లలు చదువుకోడానికి మంచి స్కూల్ ఉందని సంతోషించారు. పర్యాటక ప్రదేశాల్లో హౌస్‌కీపింగ్ లాంటి పనులకు కుదిరాడు.
అత్యంత వెనుకబడిన ' మలయలి ' అనే గిరిజన తెగ వాళ్లది. ఆ తెగలో అమ్మాయిలను చదివించడం, బయటకు పంపడం పట్ల అనేక ఆంక్షలు ఉంటాయి. కానీ, కాళిదాస్ మల్లిగ దంపతులు వాటిని పట్టించుకోలేదు. తన పెద్ద కుమార్తె శ్రీపతి ప్రతిభచూపడం, ఉన్నత చదువులు చదువుతానని పట్టుబట్టడంతో వెనకడుగు వేయలేదు. ఆమెను తిరువన్నామలైలో లా కోర్సు చదివించారు. అయితే, బంధువుల ఒత్తిడి కారణంగా వెంకట్రామన్ అనే వ్యక్తితో శ్రీపతికి వివాహం జరిపించారు.కానీ, పెళ్లైనా శ్రీపతి చదువు ఆపలేదు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ లా విశ్వవిద్యాలయంలో పీజీ చేసింది. ఎంఎల్ పూర్తయిన కొద్ది రోజుల్లో సివిల్ జడ్జ్ ఉద్యోగాల భర్తీకి తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో పరీక్షకు దరఖాస్తు చేసింది. ఇంతలో ఆమెకు మరో చిక్కు వచ్చి పడింది. అప్పటికి తాను గర్భవతిని అని తెలిసి, .సరిగ్గా పరీక్ష, తన డెలివరీ ఒకేసారి అయ్యేలాగ ఉందని ఆందోళన చెందింది. కానీ, తల్లిదండ్రులు, తాను ఎంతగానే అభిమానించే ఉపాధ్యాయురాలు మహాలక్ష్మి, భర్త వెంకట్రామన్ ధైర్యం చెప్పారు. చదువుపై దృష్టిపెట్టాలని, అంతా మంచే జరుగుతుందని సర్ది చెప్పారు.
వారు ఇచ్చిన ధైర్యం, ప్రోత్సాహంతో శ్రీపతి దీక్షగా చదివింది. ప్రసవానికి వెళ్లేముందు కూడా పుస్తకాలు వదలలేదు. ఇక, తల్లి మల్లిగ అనుక్షణం తన కుమార్తె ఆరోగ్యం కనిపెట్టుకుని ఉంది. గతేడాది నవంబర్ 27న శ్రీపతి పండంటి పాపకు జన్మనిచ్చింది. రెండు రోజుల బాలింతగా ఉన్న ఆమె నవంబర్ 29న 250 కి.మీ. దూరంలో ఉన్న చెన్నైకు వెళ్లి పరీక్షకు హాజరైంది. వెళ్తే ప్రాణాలకే ప్రమాదమని వైద్యులు ఆమెను వారించినా వినలేదు. తన శ్రమ వృధా కాకూడదని వేడుకుంది. తల్లిదండ్రులు భర్త సహకారంతో పసిగుడ్డుతో ప్రయాణం చేసి పరీక్ష రాసింది .
రాత పరీక్షలో ఎంపికై.. ఇంటర్వ్యూకి అర్హత సాధించింది. ఈ నెల 15న తుది ఫలితాలు విడుదల కాగా.. జూనియర్ సివిల్ జడ్జ్‌గా ఎంపికైంది. దీంతో రాష్ట్రంలో ఈ ఉద్యోగం సాధించిన మొట్టమొదటి గిరిజన మహిళగా రికార్డులకెక్కింది. అకుంఠిత దీక్షతో, ఎన్నో అవాంతరాలు ఎదురైనా ధైర్యంగా ముందుకుసాగి విజయాన్ని అందుకుంది.