కేరళలో వరకట్న వేధింపుల ఆత్మహత్యలు పెరుగుతున్న వేళ.. రెండు వందల ఏళ్ల కిందటే ముందుచూపుతో పూర్వపు ట్రావెన్‌కోర్ సంస్థానం మహారాణి గౌరీ పార్వతీ బాయీ జారీ చేసిన కీలక ఉత్తర్వులు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. వివాహ సమయంలో ‘వర దక్షిణ’ పేరుతో అమ్మాయి కుటుంబం ఇచ్చే కట్నకానుకలపై ఆమె ఆంక్షలు విధించడం గమనార్హం. మహారాణి గౌరీ పార్వతీ బాయీ 1815 నుంచి 1829 వరకు ట్రావెన్‌కోర్ సంస్థానాన్ని పరిపాలించారు. అప్పటికి సమాజంలోని కొన్ని వర్గాల్లో ముఖ్యంగా బ్రాహ్మణుల్లో ‘వర దక్షిణ’ ఆచారం ప్రబలంగా ఉండేది. వరుడి తరఫువారు అమ్మాయి కుటుంబం నుంచి ఎక్కువ సొమ్ము డిమాండ్ చేసేవారు. దీంతో అంతగా స్థోమతలేని కుటుంబాల్లోని ఆడపిల్లలకు వివాహం కావడం కష్టమయ్యేది.
ఈ సమస్య రాణి పార్వతీ బాయీ దృష్టికి వెళ్లడంతో ఆమె విస్తుపోయారు. దీనికి పరిష్కార మార్గంగా 1823లో ఆమె వర దక్షిణపై పరిమితులు విధిస్తూ ఉత్తర్వు జారీ చేశారు. దీనికి సంబంధించిన ప్రతులు ప్రస్తుతం స్టేట్ ఆర్కైవ్స్‌లో అందుబాటులో ఉన్నాయి. బ్రాహ్మణుల్లో ప్రధానంగా నంబూథ్రి, పొట్టి వర్గాల మహిళల దుస్థితిని ఈ ఉత్తర్వులో మహారాణి ప్రధానంగా ప్రస్తావించారు. ఆ వర్గాల్లోని ఆడపిల్లలకు 10-14 ఏళ్ల మధ్య వివాహం కావాల్సి ఉన్నా. వరకట్నం కింద అబ్బాయి కుటుంబం 1,000-2,000 ఫనమ్‌లు (అప్పటి డబ్బు) డిమాండ్ చేస్తుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.
అమ్మాయిల కుటుంబాలు అంత మొత్తాన్ని ముట్టజెప్పలేకపోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వర దక్షిణ కింద 700 ఫనమ్‌ల కంటే ఎక్కువ అడగకూడదని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. తన ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీనిని బట్టి వందల ఏళ్ల కిందటే కేరళలో వరకట్నం ప్రబలంగా ఉందనే విషయం అవగతమవుతోంది.
ఆసక్తికర విషయం ఏంటంటే ట్రావెన్‌కోర్ సంస్థానంలో పార్వతీ బాయీ విద్యను బాగా ప్రోత్సహించారు. బహుముఖ ప్రజ్ఞాశాలి, ట్రావెన్‌కోర్ రాజు స్వాతి తిరుమల్ సోదరి అయిన పార్వతీ బాయీ... విద్యను ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు ఉపాధ్యాయులను నియమించారు. మొదటిసారిగా సంస్థానంలో బోధన కోసం ‘గ్రంథాలు’ ప్రచురించారు. దీనిపై ప్రఖ్యాత చరిత్రకారుడు టి పి శంకరన్‌కుట్టి మాట్లాడుతూ.. ట్రావెన్‌కోర్‌లో వరకట్న ఆచారం ఎక్కువగా ఉందని రుజువు చేయడానికి చారిత్రక పత్రాలు ఎక్కువ అందుబాటులో లేవని అన్నారు. కానీ, రాణి రాజ శాసనం ముఖ్యమైంది అని తెలిపారు.
‘సాధారణంగా సంస్థానం రాజులు, రాణులు ఇటువంటి నిర్ణయాలు తీసుకోరు.. కానీ, ట్రావెన్‌కోర్ మహారాణి ఉత్తర్వులు గొప్ప ప్రాముఖ్యమైనవి’ అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, గత రెండేళ్లుగా కేరళలో వరకట్న వేధింపులు, వాటి వల్ల మహిళల ఆత్మహత్యలు ఎక్కువయ్యాయి. మరింత బంగారం, ఖరీదైన కారు, ఇతర ఆస్తులు కావాలని భర్త వేధించడంతో ఇటీవల ఓ వైద్య విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. దీంతో ఆమె భర్త అయిన వైద్యుడ్ని పోలీసులు అరెస్ట్ చేసినా.. బెయిల్‌పై బయటకు వచ్చాడు.