‘పెళ్లెప్పుడవుతుంది బాబూ.. నాకు పిల్ల యాడ దొరుకుతుంది బాబు.. ఏజ్ బారు అయ్యినాక ఎవరు చేసుకుంటాడండి’ అంటూ ఓ తెలుగు సినిమాలో హీరో తన పెళ్లి కష్టాలను ఏకరవుపెట్టుకుంటాడు. తాజాగా, ఓ యువకుడు కూడా అలాగే తనకు అమ్మాయి దొరకడం లేదని తెగ బాధపడిపోతూ.. తాను నడిపే రిక్షాపై హోర్డింగ్ పెట్టుకుని తిరుగుతున్నాడు. మ్యారేజ్ బ్యూరోను సంప్రదించినా తనకు సంబంధం కుదరలేదని, నిత్యం పూజలు పునస్కారాలతో బిజీగా గడిపే మా అమ్మానాన్నలకు నా గోడు పట్టడం లేదని వాపోయాడు. నాకేమో వయసు దాటిపోతుందని, సమాజంలో అమ్మాయిలు తగ్గిపోయాని తెగ ఆందోళన చెందుతున్నాడు. మధ్యప్రదేశ్‌లోని దమోహ్ నగరానికి చెందిన ఆ యువకుడి వీడియో ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
దమోహ్ నగరానికి చెందిన 29 ఏళ్ల యువకుడు దీపేంద్ర రాథోడ్.. ఈ-రిక్షా నడుపుతున్నాడు. రాథోడ్‌కు పెళ్లీడు వచ్చినప్పటి నుంచి తగిన అమ్మాయి కోసం చూస్తున్నారు. ఓ మ్యారేజ్ బ్యూరోను సంప్రదించినా సంబంధం కుదరలేదు. దీంతో తనకు తానుగా వధువును వెదుక్కోవాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు వినూత్నంగా ఆలోచించాడు. తాను నడిపే ఈ-రిక్షాపైనే ‘వధువు కావలెను’ అనే హోర్డింగ్ ఏర్పాటుచేయడంతో అందరిదృష్టిని ఆకర్షించాడు. దీనిపై ఫోటో, తన పుట్టినతేదీ సహా వ్యక్తిగత వివరాలతో కూడిన బయోడేటాను రాసిపెట్టాడు. అంతేకాదు, కులమతాల పట్టింపుల్లేవని, స్థానికేతరులైనా ఎటువంటి అభ్యంతరం లేదని పేర్కొన్నాడు.
రిక్షాలో నగరంలో ఎక్కడికి వెళ్తున్నా.. హోర్డింగ్‌లపై బయోడేటాను ప్రజలు ఆసక్తిగా చదవుతున్నారు. దీనిపై దీపేంద్ర రాథోడ్ మాట్లాడుతూ.. ‘మా అమ్మానాన్నలు గుళ్లుగోపురాల చుట్టూ తిరుగుతూ పూజలు పునస్కారాలతో బిజీగా ఉంటారు. నాకేమో పెళ్లి వయసు దాటిపోతోంది. సమాజంలో అమ్మాయిలు తగ్గిపోయారు.. మొదట్లో ఓ మ్యారేజ్ గ్రూపును సంప్రదించాను.. కానీ, లాభం లేకపోయింది. దీంతో తల్లిదండ్రుల అనుమతితోనే ఇలా తిరుగుతున్నాను’ అని చెప్పాడు. తన జీవిత భాగస్వామి ఎప్పుడూ సంతోషంగా ఉండేలా చూస్తానని అంటున్నాడు.
‘ఒకసారి ఫేస్‌బుక్‌లో కనిపించిన మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ ఫోన్ నంబర్‌ను సంప్రదిస్తే... ముందుగా రూ.6 వేలు ఫీజు కట్టించుకుని, అమ్మాయి గురించి వివరాలు అడిగితే దామోహ్‌లోని లడన్‌బాగ్ ప్రాంతంలో నివసిస్తుందని చెప్పారు... ఆ తర్వాత లడన్‌బాగ్‌కు వెళ్లి వెతికినా ఆ పేరుగల అమ్మాయి కనిపించలేదు’ అని అన్నాడు. దీపేంద్ర తండ్రి గతంలో ప్యూన్‌గా చేసి రిటైర్ అయ్యాడు. ఇద్దరు సోదరులు కాగా.. అన్నయ్యకు వివాహమైంది. కానీ, తనకు మాత్రం అమ్మాయి దొరకడం చాలా కష్టంగా ఉందని, పెళ్లికావడం లేదంటూ రాథోడ్ తెగబాధపడిపోతున్నాడు.