ఛండీగఢ్ మేయర్ ఎన్నిక తీరుపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం ఘాటుగానే స్పందించింది. రిటర్నింగ్ అధికారి చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తే సహించబోమని హెచ్చరించింది. సోమవారం ఈ కేసు సుప్రీంకోర్టులో విచారణ జరగనుండగా.. అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. బీజేపీ నేత మనోజ్ సోంకర్ మేయర్ పదవికి ఆదివారం అర్ధరాత్రి రాజీనామా చేశారు. అలాగే, ముగ్గురు ఆప్ కౌన్సెలర్లు పూనమ్ దేవి, నేహా, గురుచరణ్ కాలాలు బీజేపీలో చేరారు.
జనవరి 30న జరిగిన ఛండీగఢ్ మేయర్ ఎన్నికల్లో ఆప్-కాంగ్రెస్ కూటమికి చెందిన 8 ఓట్లను చెల్లనవిగా ప్రకటించారు. దీంతో సంఖ్యాబలం లేని బీజేపీ నేత మనోజ్ సోంకర్‌ను విజేతగా ప్రకటించారు ఆర్వో. మొత్తం 35 మంది సభ్యులన్న ఛండీగఢ్ కార్పొరేషన్‌లో బీజేపీకి 14, కాంగ్రెస్-ఆప్ కూటమికి 20,ఎస్ఏడీకి ఒక్క సభ్యుడు ఉన్నారు. అయితే, ఓటింగ్ సమయంలో ఇండియా కూటమికి చెందిన 8 మంది కార్పొరేటర్ల ఓట్లు చెల్లుబాటు కాకపోవడంతో మేయర్ పీఠం బీజేపీ పరమైంది. కానీ, బ్యాలెట్ పేపర్లను రిటర్నింగ్ అధికారి ట్యాంపరింగ్ చేస్తున్నట్టు స్పష్టంగా వీడియోల్లో రికార్డయ్యింది. ఈ వీడియో బయటకు రావడంతో తీవ్ర దుమారం రేగింది.
ఈ క్రమంలో ఆప్ అభ్యర్థి సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. విచారణకు స్వీకరించింది. ఆర్వో వ్యవహరించిన తీరుపై విస్మయం వ్యక్తం చేసింది. ఈ కేసు సోమవారం మళ్లీ విచారణ రానున్న తరుణంలో మేయర్ రాజీనామా, ముగ్గురు ఆప్ సభ్యులు బీజేపీలో చేరడం వంటి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి.ఫిబ్రవరి 19 నాటి విచారణకు హాజరుకావాలని ఆర్వో అనిల్ మాసీని సుప్రీంకోర్టు ఆదేశించింది. వాస్తవానికి జనవరి 18న ఛండీగఢ్ మేయర్ ఎన్నిక జరగాల్సి ఉండగా.. ప్రిసైడింగ్ ఆఫీసర్‌కు అనారోగ్యం సాకుతతో ఫిబ్రవరి 6కి వాయిదా వేశారు. దీనిపై పంజాబ్ హరియాణ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు కాగా.. , జనవరి 30న ఎన్నిక చేపట్టాలని ఆదేశాలు వెలువరించింది. ఎన్నిక వాయిదా అసమంజసమని, అన్యాయమని, ఏకపక్షమని మండిపడింది.
హైకోర్టు ఆదేశాలతో ఎన్నిక నిర్వహించడం.. మెజార్టీ ఓట్లు చెల్లుబాటుకాకపోవడంతో ఈ ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ ఆప్ కౌన్సిలర్ కులదీప్ కుమార్.. పంజాబ్-హరియాణా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు ఈ పిటిషన్‌ను తిరస్కరించడంతో చివరకు ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా, ముగ్గురు ఆప్ సభ్యుల చేరికతో బీజేపీ బలం 17కి చేరగా.. ఇండియా కూటమి 17కి పడిపోయింది. ఎస్ఏడీ కౌన్సెలర్, ఎక్స్‌ఆఫీషియో సభ్యుడితో కలిసి బీజేపీకి ప్రస్తుతం 19 మంది బలం ఉంది. ఈ నేపథ్యంలో మేయర్ పీఠం తమకే దక్కుతుందని ఆ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది.