ఇది చాలా కీలకమైన సమయమని, ప్రతి ఒక్కరూ రాష్ట్ర అభివృద్ధి, దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వ్యవహరించాలని పార్టీ నాయకులకు జనసేన అధినేత పవన్కళ్యాణ్ సూచించారు. ఈసారి అధికారంలోకి రావాలనే ధ్యేయంతో కూటమిగా కలిసి వెళుతున్నామని, ఈ నేపథ్యంలో కొన్ని త్యాగాలు తప్పవని సూచనప్రాయంగా చెప్పారు. ఎక్కడైనా ఎవరికైనా పోటీ చేసే అవకాశం రాకపోతే...భవిష్యత్తులో వారికి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అసంతృప్తితోనో, వేరే విధంగానో పార్టీ గురించి ఎక్కడా బయట మాట్లాడవద్దని సూచించారు. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఇంకా నిర్ణయం కాలేదని స్పష్టంచేశారు. ఎవరికైనా అనుమానాలు, అసంతృప్తి ఉంటే వాటిని బయట మాట్లాడవద్దని, నేరుగా తన దృష్టికే తీసుకురావాలన్నారు. తాను అందుబాటులో లేనిపక్షంలో రాజకీయ వ్యవహారాల కమిటీ ఉందని, వారితో చర్చించాలని సూచించారు. అంతే తప్ప పార్టీకి నష్టం జరిగేలా వ్యవహరించవద్దని కోరారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ దృష్టిలో ఉంచుకోవాలన్నారు.