సీఎం జగన్ అమరావతిని నాశనం చేశారని తెలుగుదేశం సీనియర్ నేత యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. విజయవాడ రూరల్ ఎనికేపాడులో యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో ‘‘బాబు షూరిటీ - భవిష్యత్తు గ్యారంటీ ’’ సభ నిర్వహించారు. జాతీయ రహదారిపై తెలుగు తమ్ముళ్లు భారీ బైక్ ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ... ఏపీకు ఐటీ కంపెనీలు రావాలంటే టీడీపీ అధినేత చంద్రబాబుకే సాధ్యమని తెలిపారు. రాజధాని, పోలవరం అభివృద్ధి చెందాలంటే బాబును సీఎం చేయాలని పిలుపునిచ్చారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలంటే టీడీపీకే సాధ్యమన్నారు. సీఎం జగన్ ‘‘సిద్ధం’’ బోర్డులతో తిరుగుతున్నారని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు చంద్రబాబును సీఎం చేయటానికి తాము సిద్ధంగా ఉన్నారని తెలిపారు. సీఎం జగన్ ఒక్క ఛాన్స్ అని చెప్పి ప్రజలను మోసం చేశారని విరుచుకుపడ్డారు. అమరావతి రాజధానిగా 2014లో చంద్రబాబు అభివృద్ధి చేశారని చెప్పారు. చంద్రబాబు సీఎం పట్టాభిషేకం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు, అమరావతి రాజధాని ప్రజలు ఎదురుచూస్తున్నారని యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు.