గత ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ఎదురుగాలి వీచినా విశాఖ నగరంలోని తూర్పు, దక్షిణ, ఉత్తర, పశ్చిమ నియోజకవర్గాల్లో తెలుగుదేశాన్ని గెలిపించారని...ఈ నాలుగు సెగ్మెంట్‌లనూ తమ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ‘శంఖారావం’ యాత్రలో భాగంగా సోమవారం ఆయన ఉత్తర నియోజకవర్గ పరిధిలోని బిర్లా జంక్షన్, గాజువాక నియోజకవర్గ పరిధిలోని లంకా మైదానంలో నిర్వహించిన సభల్లో ప్రసంగించారు. రెండు నెలల్లో టీడీపీ, జనసేన ప్రభుత్వం రాబోతోందని, విశాఖ తూర్పు, దక్షిణ, ఉత్తర, పశ్చిమ నియోజకవర్గాలను ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు. కొండవాలు ప్రాంతాల్లో నివసించే ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, నిరుపేదలకు పక్కా ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. విశాఖ ఉత్తర నియోజకవర్గ పరిధిలో జాతీయ రహదారి దాటేందుకు ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఫుట్‌బ్రిడ్జిలు నిర్మిస్తామని, కరాస వద్ద అల్లూరి సీతారామరాజు విగ్రహం ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. విశాఖ ఉత్తరం నియోజకవర్గంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధే తప్ప కొత్తగా చేసిందేమీ లేదని లోకేశ్ అన్నారు. వైసీపీ ఇన్‌చార్జి కేకే రాజు నియోజకవర్గంలో రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నాయకులు నగరంలో పలుచోట్ల భూములు ఆక్రమించుకున్నారన్నారు. ఎంతో ప్రశాంతమైన విశాఖలో అశాంతి కలిగేలా వైసీపీ నేతలు వ్యవహరించారని లోకేశ్ ఆరోపించారు. మర్డర్లు, కిడ్నాప్‌లు, భూకబ్జాలు, గంజాయి అమ్మకాలకు నగరం కేంద్రంగా మారిందన్నారు. గాజువాక ప్రాంతం మినీ ఇండియా అని లోకేశ్ అభివర్ణించారు. విశాఖ ఉక్కు కర్మాగారం, భెల్, హెచ్‌పీసీఎల్, గంగవరం పోర్టు వంటివి ఇక్కడ ఉన్నాయని పేర్కొంటూ దేశం నలుమూలల నుంచి వచ్చి ఇక్కడ నివసిస్తున్నారన్నారు. టీడీపీ, జనసేన బలపరిచిన అభ్యర్థిని గెలిపిస్తే అగనంపూడి టోల్‌గేటు ఎత్తివేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. గంగవరం పోర్టు బాధితులను ఆదుకుంటామని, ఏపీఐఐసీ నిర్వాసితుల సమస్యలు పరిష్కారిస్తామని, గంగవరం పోర్టు కాలుష్యం తగ్గించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గాజువాక పట్టణంలోకి భారీ వాహనాలు రాకుండా ఫ్రైట్ కారిడార్‌తోపాటు ఫ్లైవోవర్లు ఏర్పాటుకు కృషిచేస్తామని, గంగవరం మత్స్యకారుల కోసం జెట్టీకి బ్రేక్ వాటర్ ఏర్పాటుచేస్తామన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో గాజువాక నియోజకవర్గాన్ని పల్లా శ్రీనివాసరావు నేతృత్వంలో రూ.1000 కోట్లతో అభివృద్ధి చేశామన్నారు. దశాబ్దాల నుంచి పెండింగ్‌లో ఉన్న భూ సమస్యను పరిష్కరించి, 19 వేల మందికి పట్టాలు పంపిణీ చేశామన్నారు. తమ ప్రభుత్వ హయాంలో అన్ని కులాలు, మతాలకు సంక్షేమ పఽథకాలు అందించామని, సామాజిక భవనాలు నిర్మించామని చెప్పారు.