వారపు సంతల్లో, మార్కెట్లలో పింక్ కలర్‌లో మెరుస్తూ.. నోట్లో ఇలా వేసుకుంటే అలా కరిగిపోయే పీచు మిఠాయి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అప్పుడప్పుడే దంతాలు వస్తున్న చిన్నారి నుంచి, పళ్లు మొత్తం ఊడిపోయిన ముసలాళ్ల వరకూ అందరూ ఈ పీచు మిఠాయి టేస్టు చూసిన వారే. చేతికి వాచీలా కట్టుకుని దాని అందానికి మురిసిపోయిన వారే. అయితే అందరూ ఎంతో ఇష్టంగా తినే ఈ పీచు మిఠాయిపై ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చనడుస్తోంది. పీచు మిఠాయిపై పుదుచ్చేరి, తమిళనాడు ప్రభుత్వాలు నిషేధం విధించడమే ఇందుకు కారణం. అయితే ఏపీ ప్రభుత్వం కూడా పీచు మిఠాయిపై ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. నాణ్యతను పరిశీలించేందుకు నమూనాలను టెస్టింగ్‌కు పంపనుంది.
కాటన్ క్యాండీ అని ఇంగ్లీషులో పిలిచే ఈ పీచు మిఠాయిలో రోడమైన్- బి అనే రసాయనం ఉందని పుదుచ్ఛేరి అధికారులు ఇటీవల గుర్తించారు. కృత్తిమ రంగుల కోసం ఈ కెమికల్‌ను వినియోగిస్తున్నట్లు తేల్చారు. ఈ కెమికల్ క్యాన్సర్ కారకంగా తేల్చారు. పుదుచ్చేరి ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో పీచు మిఠాయిల్లో రోడమైన్ -బి అనే కెమికల్ వాడుతున్నట్లు తేలడంతో పుదుచ్చేరిలో దీనిని నిషేధించారు. ఆపై తమిళనాడు ప్రభుత్వం సైతం పీచు మిఠాయి నాణ్యతను పరిశీలించి నిషేదం విధించింది. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం కూడా అలర్ట్ అయ్యింది. పీచు మిఠాయి నాణ్యతను పరిశీలించేందుకు అన్ని జిల్లాల నుంచి శాంపిళ్లను సేకరించి, పంపాలని జిల్లాల అధికారులను ఆదేశించింది. ఇలా సేకరించిన నమూనాలను టెస్టింగ్‌కు పంపాలని నిర్ణయం తీసుకుంది.ఈ విషయాన్ని స్టేట్ హెల్త్ అండ్ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ నివాస్ వెల్లడించారు.
అయితే జిల్లాల నుంచి పీచు మిఠాయి శాంపిళ్లు రాగానే ఈ వారంలో పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపనున్నట్లు ఫుడ్ సేఫ్టీ కమిషనర్ తెలిపారు. టెస్టుల్లో వచ్చిన ఫలితాల ఆధారంగా నిషేధం విధించాలా వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కాటన్ క్యాండీల తయారీలో ఉపయోగించే సింథటిక్, నాన్ పర్మిటెడ్ రంగులు క్యాన్సర్ కారకమని, అలాగే ఎలాంటి రంగు లేకుండా చేసిన పీచు మిఠాయిలు కూడా అపరిశుభ్రమైన పరిస్థితులలో తయారు చేసినందున సురక్షితం కాదని అన్నారు. అయితే అన్ని ప్రాంతాల నుంచి పీచు మిఠాయి శాంపిళ్లను సేకరించి, పరీక్షించేందుకు సుమారు నెలరోజుల సమయం పడుతుందని చెప్పారు.
తమిళనాడు, పుదుచ్చేరిలో పీచు మిఠాయిపై నిషేధంతో ఇప్పటికే కొంతమంది వ్యాపారులు వీటి విక్రయాలను నిలిపివేసినట్లు ఏపీ అధికారులు తెలిపారు. ప్రస్తుతానికైతే పండుగలు, జాతర సమయాల్లో వీటి విక్రయాలపై పరిమితులు విధించినట్లు చెప్పారు. తల్లిదండ్రులు పిల్లల విషయంలో జాగ్రత్త వహించాలన్న అధికారులు.. స్కూళ్ల వద్ద ఏదిపడితే అది తినకుండా చూడాలని సూచించారు. కాలం చెల్లిన తినుబండారాలతో పిల్లల ఆరోగ్యానికి ఇబ్బంది కలిగే అవకాశం ఉందని జాగ్రత్తలు చెప్పారు.