పల్నాడు జిల్లా, చిలకలూరిపేటలో ‘రాజధాని ఫైల్స్’ చిత్రాన్ని గురువారం మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావు వీక్షించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతుల త్యాగం- జగన్ మోసానికి దృశ్యరూపం ఈ సినిమా అని చెప్పారు. రాజధానిలో జరుగుతున్న అరాచకాలను కళ్లకు కట్టినట్లు ఈ చిత్రంలో చూపించారని తెలిపారు. రైతుల కన్నీళ్లకు, వారి ఉద్యమస్ఫూర్తికి చిత్రం అద్దంపట్టిందని అన్నారు. పగ ప్రతీకారాలు తప్ప అభివృద్ధి, సంక్షేమం, త్యాగాల విలువ జగన్కు తెలియదన్నారు. రాజకీయ కక్ష్యతో ప్రపంచస్థాయి నగర నిర్మాణ స్వప్నాల్ని చిదిమేశారని మండిపడ్డారు. రైతుల్ని రోడ్డున పడేసిన పాపాన్ని జగన్ జన్మజన్మలకు కడుక్కోలేరని అన్నారు. మరో 2 నెలల్లో రాష్ట్రానికి ఈ గ్రహణం పోయి అమరావతికి మంచిరోజులు వస్తాయని ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు.