ఇసుకాసురుడు జగన్ రెడ్డి.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన దోపిడీకి జైలుకెళ్లడం ఖాయమని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ హెచ్చరించారు. శుక్రవారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలోని అక్రమ ఇసుక తవ్వకాలపై కేంద్ర అటవీ మరియు పర్యావరణ శాఖ NGTకి ఇచ్చిన నివేదికపై జగన్ రెడ్డి, పెద్దిరెడ్డి ఎందుకు నోరువిప్పడం లేదని ప్రశ్నించారు. తన తొత్తు డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ వెంకటరెడ్డితో కలిసి పెద్దిరెడ్డి మీడియా ముందుకొచ్చి NGT నివేదికపై సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. ఏపీలో జరుగుతున్న ఇసుక దోపిడీని కప్పిపుచ్చుతూ గతంలో 22-08-2023న వెంకటరెడ్డి ఏకంగా NGTకే తప్పుడు సమాచారమిచ్చారని మండిపడ్డారు. తాము 110 రీచ్‌లను పరిశీలించామని, ఎక్కడా నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు జరగడం లేదంటూ NGTకి తప్పుడు సమాచారమిచ్చిన వెంకటరెడ్డి కూడా తప్పించుకోలేరని వార్నింగ్ ఇచ్చారు. ఇసుకాసురుడు జగన్ రెడ్డి మొత్తంగా పాల్పడిన ఇసుక లూఠీ రూ.50వేల నుంచి రూ.60వేల కోట్లని గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజెంటేషన్ ద్వారా చెప్పింది నూటికి నూరుశాతం వాస్తవమని నేడు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఉమ్మడి కమిటీ తేల్చిచెప్పిందన్నారు. విచ్చలవిడిగా ఇసుకదోపిడీకి పాల్పడి అడ్డంగా దొరికిపోయారు కాబట్టే తేలుకుట్టిన దొంగల్లా జగన్ రెడ్డి.. పెద్దిరెడ్డి నోరెత్తడం లేదని ధ్వజమెత్తారు. పేదలు ఇళ్లు నిర్మించుకోవడానికి వీల్లేకుండా వేల కోట్ల ఇసుక దోపిడీకి పాల్పడిన జగన్ రెడ్డి పేదవాడా? అని నిలదీశారు.