మేడారం సమ్మక్క సారక్క జాతర సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే రెండు పథకాలను అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు మరో రెండు పథకాలను ప్రారంభించనుంది. ఈ మేరకు.. రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. 500 కే గ్యాస్ సిలిండర్‌తో పాటు ప్రతి ఇంటికి 200 యూనిట్ల కరెంట్ ఉచితం పథకాలను ఫిబ్రవరి 27 నుంచి అమలు చేయనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ పథకాలు అమలు చేసేందుకు ప్రియాంక గాంధీ వస్తారని తెలిపారు. మేడారం సమ్మక్క సారక్కను దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఈ మేరకు ప్రకటన చేశారు.
బేగంపేట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో సీఎం రేవంత్ రెడ్డి మేడారం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు జాతర నిర్వాహాకులు, మంత్రి సీతక్క ఘన స్వాగతం పలికారు. వన దేవతలను దర్శించుకున్న రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని వన దేవతలను వేడుకున్నట్టు తెలిపారు. ములుగు జిల్లాతో పాటు మంత్రి సీతక్కతో కూడా తనకు ప్రత్యేక అనుబంధం ఉందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తన రాజకీయ ప్రస్థానంలో ముఖ్యమైన కార్యక్రమాలన్నింటినీ ములుగు నుంచే ప్రారంభించానని సీఎం గుర్తు చేశారు.
అయితే.. గతంలో సీఎంగా ఉన్న కేసీఆర్.. వనదేవతలను దర్శించుకోలేదు కాబట్టే ఓడిపోయారంటూ రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మేడారం జాతరకు కోటిన్నరకుపైగా భక్తులు వస్తే దీన్ని జాతీయ పండుగగా మార్చాలని కేంద్రాన్ని కోరినట్టుగా తెలిపారు. కానీ మోదీ సర్కార్ పట్టించుకోలేదని అసహనం వ్యక్తం చేశారు. దక్షిణాది కుంభమేళాకు కేంద్రం ఇచ్చేది రూ. 3 కోట్ల రూపాయలేనా అని ప్రశ్నించారు.
"హాత్ సే హాత్" జోడో యాత్రను కూడా ములుగు జిల్లా నుంచే ప్రారంభించామన్న రేవంత్ రెడ్డి.. యాత్రలో మాట ఇచ్చిన మేరకు మేడారం జాతర ఏర్పాట్లకు ప్రభుత్వం నుంచి రూ.110 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. పాలకులు ప్రజలను పీడించినప్పుడు ఎవరో ఒకరు వారికి ఎదురొడ్డి నిలబడతారని పేర్కొన్నారు. సమ్మక్క, సారక్క జాతరను జాతీయ పండుగగా ప్రకటించడం సాధ్యం కాదని కిషన్ రెడ్డి చెప్పినట్లుగా విన్నానని.. అలా అయితే కుంభమేళాను కేంద్రం జాతీయ పండుగగా నిర్వహిస్తుంది కదా అని ప్రశ్నించారు. మేడారం జాతరపై కేంద్రం వివక్ష చూపడం సరికాదన్నారు. గతంలో కుంభమేళాకు కేంద్రం రూ.వందల కోట్లు విడుదల చేసిందని గుర్తు చేసిన రేవంత్ రెడ్డి.. తెలంగాణ కుంభమేళా అయిన మేడారం జాతరకు మాత్రం 3 కోట్లేనా అన్ని ప్రశ్నించారు.