ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేత కార్మికులకు శుభవార్త చెప్పింది. పవర్ లూమ్ చేనేతలకు భారీ ఊరటను కలిగిస్తూ నిర్ణయం తీసుకుంది. పవర్ లూమ్‌లకు విద్యుత్ సబ్సిడీని ఇస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. యూనిట్‌కు 94 పైసలు రాయితీని ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.ఎలక్ట్రిసిటీ డ్యూటీ రూ.1 నుంచి 6 పైసలకి తగ్గించింది. పవర్ లూమ్స్ నిర్వహించే చేనేతలకు మేలు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయం పట్ట పవర్ లూమ్స్ మగ్గాల ద్వారా చీరలను నేసే నేతన్నలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏపీవ్యాప్తంగా పలుచోట్ల పవర్ లూమ్స్ ద్వారా చీరలను తయారుచేస్తున్నారు. ముఖ్యంగా ధర్మవరం, హిందూపురం ప్రాంతాల్లో పవర్ లూమ్స్ మగ్గాలు అధికంగా ఉన్నట్లు అంచనా. అయితే హ్యాండ్ లూమ్స్ వారికి మాత్రమే ప్రభుత్వం నుంచి రాయితీలు అందుతున్నాయని, తమను కూడా పట్టించుకోవాలంటూ పవర్ లూమ్ చేనేతలు కోరుతున్నారు, విద్యుత్ రాయితీ కల్పించాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే యూనిట్‌కు 94 పైసలు రాయితీ కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.