వైయస్ఆర్‌సీపీ ‘సిద్ధం’ నాలుగో సభ ఖరారైంది. మార్చి 3న బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం మేదరమెట్లలో వైయస్ఆర్‌సీపీ సిద్ధం సభ నిర్వహించనున్నారు. రాప్తాడులో నిర్వహించిన సభను మించి మేదరమెట్ల సభ నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సిద్ధం సభకు గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల కార్యకర్తలు హాజరుకానున్నారు. సభ ఏర్పాట్లపై తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలతో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి సన్నాహక సమావేశం నిర్వహించారు. భీమిలి, ఏలూరు, రాప్తాడులలో నిర్వహించిన సభలకు జనం సంద్రంలా పోటెత్తడం.. జయహో వైయస్ జగన్, మళ్లీ సీఎం జగనే అన్న నినాదాలతో సభా ప్రాంగణాలు ప్రతిధ్వనించడంతో వైయస్ఆర్‌సీపీ శ్రేణులు సమరోత్సాహంతో కదం తొక్కుతున్నాయి.కంచు కోటలను బద్దలు కొట్టేలా జరుగుతోన్న సిద్ధం సభకు కీలక ప్రాంతాలను వేదికలుగా వైయస్ఆర్‌సీపీ ఎంచుకుంటోంది. భారీ సభల నిర్వహణ ద్వారా రాజకీయంగా పైచేయి సాధించటంతో పాటుగా.. వైయస్ఆర్‌సీపీ కేడర్‌లో కొత్త ఉత్సాహం పెరుగుతోందని భావిస్తున్నారు. ఈ సభలోనే సీఎం జగన్ కీలక ప్రకటన చేస్తారని తెలుస్తోంది. గెలుపు నినాదంతో పాటు రైతులకు, మహిళలకు సంబంధించిన కీలక ప్రకటన ఉంటుందని సమాచారం.