సాగర నగరం విశాఖ సిగలో మరో మణిహారం వచ్చి చేరింది. ఆర్కే బీచ్ వద్ద వైఎంసిఏ సమీపంలో రూ.1.60 లక్షల వ్యయంతో నిర్మించిన ఫ్లోటింగ్ బ్రిడ్జిని వైఎస్‌ఆర్సీపీ నేత, రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్‌లు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. విశాఖ చాలా ప్రశాంతమైన నగరమని అన్నారు. బీచ్‌లో రూ.1.60 కోట్ల వ్యయంతో ప్లోటింగ్ బ్రిడ్జిని పూర్తిచేసి, పర్యాటకులకు అందుబాటులోకి తీసుకువచ్చినట్టు తెలిపారు. ప్లోటింగ్ వంతెన వల్ల పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
సీఎం జగన్‌మోహన్ రెడ్డి రాష్ట్రంలో వివిధ బీచ్‌ల అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. పర్యాటకులను ఆకర్షించేలా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో విశాఖలో పరిపాలన రాజధాని ముఖ్యమంత్రి ప్రారంభించే కార్యక్రమం ఉంటుందని చెప్పారు. విశాఖ నుంచే ప్రభుత్వం పాలన నడుపుతుందని పునరుద్ఘాటించారు. విశాఖ నగర అందాలు పర్యాటకులను ఇట్టే కట్టిపడేస్తాయి. ఆహ్లదకరమైన వాతావరణం పర్యాటకులను మరుపురాని అనుభూతులను మిగుల్చుతాయి. రామకృష్ణా బీచ్, కైలాసగిరి, తోట్లకొండ, డచ్ సమాధులు, ఋషికొండ బీచ్, భీమిలి ఇలా చెప్పుకుంటు పోతే పర్యాటకులు సేదదీరేందుకు విశాఖ నగరం కేరాఫ్ అడ్రస్‌గా. తాజాగా ఈ జాబితాలోకి ఫ్లోటింగ్ బ్రిడ్జ్ వచ్చి చేరింది. ఈ వంతెన అందుబాటులోకి రావడంతో ఉవ్వెత్తున ఎగసిపడే కెరటాలపై తేలియాడుతూ కడలి అందాలను దగ్గరగా చూడొచ్చు. ఇదో మరుపురాని మధురానుభూతిని మిగుల్చుతుందనడంలో సందేహం లేదు. విశాఖ మెట్రోపాలిటన్ రీజయన్ డెవలప్మెంట్ అథారిటీ (విఎంఆర్డీఏ) ఆర్కే బీచ్ వద్ద ఫ్లోటింగ్ బ్రిడ్జ్ నిర్మాణ ప్రాజెక్టును చేపట్టింది. జనవరి మొదటి వారంలో ఈ పనులు చేపట్టి.. శరవేగంగా పూర్తిచేసింది.