కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వీకెండ్ కావడంతో శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు తరలివచ్చారు. దీంతో కొండపై ఉన్న 31 కంపార్టుమెంట్లు యాత్రికులతో నిండిపోయాయి. ఎంబీసీ వరకూ క్యూలైన్‌లు విస్తరించాయి. టోకెన్ల లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. శనివారం స్వామివారిని 72, 175 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే, 29,543 వేల మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. స్వామివారికి హుండీ కానుకల ద్వారా రూ.3.74 కోట్ల మేర ఆదాయం సమకూరింది.
కాగా, తిరుమలలో శనివారం రాత్రి పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్పస్వామి గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. ప్రతినెలా పౌర్ణమి రోజున తిరుమలలో గరుడవాహన సేవ నిర్వహించే సంప్రదాయం కొనసాగుతోంది. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.
మరోవైపు, శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయానికి వాయవ్య దిశలో వెలిసిన శ్రీకుమారధార తీర్థ ముక్కోటి శనివారం వైభవంగా జరిగింది. ఈ వేడుకలో పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించారు. ఏటా మాఘపూర్ణిమనాడు ఈ తీర్థ ముక్కోటిని నిర్వహిస్తారు. ప్రకృతి సౌందర్యాల నడుమ కుమారధార తీర్థంలో స్నానమాచరించడాన్ని భక్తులు ప్రత్యేక అనుభూతి పొందుతారు. శేషాచల కొండల్లోని క్లిష్టమైన దారుల్లో ఎంతో భక్తితో పెద్దసంఖ్యలో భక్తులు తీర్థానికి చేరుకున్నారు.