ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలోని శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామివారి ఆలయంలో ఆదివారం వైభవంగా స్వర్ణపుష్పార్చన నిర్వహించారు. 108 బంగారు సంపెంగలతో స్వామి, అమ్మవార్లకు శోభాయ మానంగా స్వర్ణపుష్పార్చన జరిపించినట్లు ఆలయన ఈవో శ్రీనివాసమూర్తి తెలియజేశారు. ఆదివారం ఉదయం స్వామివారికి అత్యంత వైభవంగా జరిగిన స్వర్ణపుష్పార్చనలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సింహాచల పుణ్య క్షేత్రంలో వేదపండితుల వేదమంత్రాల, నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా స్వర్ణ పుష్పార్చన వైభవంగా సాగింది.
ఉత్సవంలో భాగంగా అర్చకులు వేకువజామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొలిపి ప్రాతఃకాల పూజలను సాంప్రదాయ బద్దంగా నిర్వహించారు. శ్రీ దేవి, భూదేవి సమేత శ్రీగోవింద రాజు స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం ఆలయ కళ్యాణ మండపంలో వేదికపైకి వేంపుచేశారు. మండపంలో అధిష్టింపజేసి వేద మంత్రాలు నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ స్వర్ణపుష్పార్చన, సేవ వైభవంగా నిర్వహించారు. ప్రత్యక్షంగా భక్తులు శ్రీ స్వామి వారి ఆర్జిత సేవలలో పాల్గొని తరించారు.
కాగా, శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామివారి ఆలయంలో ప్రతి ఆదివారం, గురువారం స్వర్ణ సంపెంగ పుష్పాలతో స్వామికి అర్చన నిర్వహిస్తారు. 2019 వరకూ ఒక భక్తుడు స్వామికి కానుకగా ఇచ్చిన 108 స్వర్ణ సంపెంగ పుష్పాలతో అర్చన నిర్వహిస్తూ వచ్చారు. అయితే, ఆ పుష్పాలు కేవలం బంగారు పూతవి కావడంతో పక్కా స్వర్ణపుష్పాలను తయారు చేయించాలని దేవస్థానం 2019 ఫిబ్రవరిలో నిర్ణయించింది. ఒక్కో స్వర్ణ పుష్పం 18 గ్రాముల బరువుతో మొత్తం 132 స్వర్ణపుష్పాలను తయారు చేయించారు.
వైభవ్ జ్యూయలర్స్ ద్వారా కోయంబత్తూరుకి చెందిన ఒక వ్యాపార సంస్థకు ఆ బాధ్యతలు అప్పగించారు. ఒక్కో స్వర్ణ పుష్పానికి 64 వేలు ఖర్చుకాగా.. దాతల నుంచి విరాళంగా సేకరించారు. దేవస్థానం సంకల్పానికి దాతల నుంచి విశేషంగా ఆదరణ లభించింది. మొత్తం 103 మంది దాతలు132 స్వర్ణపుష్పాలకి విరాళాలను అందజేశారు.