ఏపీలో కాంగ్రెస్ పార్టీ తొలి గ్యారెంటీని ప్రకటించింది. తెలంగాణలో ఆరు గ్యారెంటీలు ప్రకటించి అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ ఏపీలోనూ పునర్వైభవం సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. అందులో భాగంగా అనంతపురంలో జరిగిన న్యాయసభలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలి గ్యారెంటీని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. ప్రతి నిరుపేద కుటుంబానికి ప్రతి నెలా ఐదువేలు ఇస్తామని ప్రకటించారు. ఇందిరమ్మ అభయం కింద ఇంటింటికి మహిళల పేరు మీద రూ.5 వేల ఆర్థిక సాయం అందజేస్తామని వెల్లడించారు. మహిళల పేరు మీదనే చెక్కు పంపిణీ చేస్తామని షర్మిల చెప్పారు.
"కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి పునాదులు వేసింది. మెట్టు మెట్టు కట్టుకుంటూ నిర్మాణం చేసింది. ఇదే కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రం కోసం ఒక గ్యారెంటీ ఇస్తోంది. అదే ఇందిరమ్మ అభయం.. ఇంటింటికీ 5 వేలు చొప్పున అందిస్తాం. పేద కుటుంబాలు నిర్భయంగా బతికేందుకే ఈ పథకం.. పేదరిక నిర్మూలన కోసం ఇందిరమ్మ అభయం.. అసమానతలు తొలగింపు కోసం ఈ నూతన ఆలోచన. ప్రతి ఇంటికి అండగా నిలబడేది ఇందిరమ్మ అభయం..ఇంటికి దైవం ఇల్లాలు. అందుకే మహిళలకు ఈ గ్యారెంటీ.. మహిళ పేరు మీదనే చెక్కు ఇస్తాం." అని వైఎస్ షర్మిల ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన పదేళ్లలో పది అడుగులు కూడా ముందుకు వెళ్లలేదని షర్మిల విమర్శించారు. చంద్రబాబు, జగన్ పాలనలో 25 ఏళ్లు వెనక్కి వెళ్ళిందని మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలు వేగంగా అభివృద్ధి లో దూసుకుపోతున్నాయన్న షర్మిల.. ఏపీని అభివృద్ధిలో వెనక్కి నెట్టిన ఘనత చంద్రబాబు,జగన్‌దని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు, వైఎస్ జగన్ ఇద్దరూ మోసం చేశారన్న షర్మిల.. అధికారం అనుభవించి ఊసరవెళ్లిలా రంగులు మార్చారని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి చంద్రబాబు, జగన్ ఇద్దరూ ద్రోహులేనని అన్నారు.
అనంతపురం సభలో సీఎం వైఎస్ జగన్ మీద కూడా షర్మిల విమర్శనాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ పక్షాన ఆందోళన చేస్తుంటే... నన్ను ఈడ్చి పడేశారని అన్నారు. వైఎస్సార్ జలయజ్ఞం ప్రాజెక్ట్ లో 54 ప్రాజెక్ట్ లు కడితే.. ఐదేళ్లలో జగన్ ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదని అన్నారు. కాంగ్రెస్ పక్షాన ప్రశ్నిస్తుంటే చెల్లెలు అని కూడా చూడకుండా తనపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. డబ్బులు పోసి సోషల్ మీడియా ద్వారా ఇష్టం వచ్చినట్లు దూషిస్తున్నారని అన్నారు,
" ఒకప్పుడు ఇదే చెల్లెలు 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది. రాష్ట్ర హక్కుల కోసం ఇదే చెల్లెలు ఉద్యమం చేసింది.. బై బై బాబు అంటూ ఉద్యమం చేసింది. మీకోసం ఇదే చెల్లెలు ఇంత కష్టం చేస్తే.. నా మీద, నా భర్త మీద నిందలు వేస్తున్నారు. మీరు ఏం చేస్తున్నదీ దేవుడు చూస్తున్నాడు. ఎన్ని నిందలు వేసినా వైఎస్సార్ బిడ్డ భయపడదు..ఆంధ్ర రాష్ట్ర హక్కులు సాధించే వరకు వైఎస్సార్ బిడ్డ ఇక్కడ నుంచి కదలదు." అని షర్మిల స్పష్టం చేశారు.