విశాఖవాసులను పోలీసులు అలర్ట్ చేశారు. నగరంలో ట్రాఫిక్ సహా ఇతర అంశాలపై సీపీ కీలక ఆదేశాలు జారీ చేశారు. విశాఖ పోలీస్ కమిషనర్, అడిషనల్ జిల్లా మేజిస్ట్రేట్ శ్రీ రవి శంకర్ ఆదేశాల మేరకు నగర పరిధిలో షాపింగ్ మాల్స్ సమీపంలో, ప్రధాన షాపుల దగ్గర రోడ్లపై వాహనాలను ఇష్టం వచ్చినట్లుగా నిలిపివేయడం వలన వాహనదారులు, పాదచారులు రోడ్లపై ప్రయాణించేటప్పుడు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారన్నారు. నగరంలో రోజురోజుకి పెరుగుతున్న వాహనాల రాకపోకలు కారణంగా ట్రాఫిక్ రద్దీ పెరుగుతోందని.. రోడ్ స్పేస్ తక్కువ ఉంటుంది కాబట్టి.. వినియోగదారులు తమ వాహనాలను రోడ్ల పై నోపార్కింగ్ ప్రదేశంలో, ఎక్కడికక్కడ నిలిపి వేయకుండా సెల్లార్‌లలో పార్కింగ్ చేసుకోవాలని వినియోగదారులకు, షాపింగ్ మాల్స్ యాజమాన్యాలకు అవగాహనను కల్పించి, అమలుచేస్తున్నామన్నారు.
ఈ నె 24 నుంచి నగరంలో ఉన్న వాహనదారులు ఇష్టానుసారంగా రోడ్లపై ఎక్కడపడితే అక్కడ వాహనాలను నిలిపివేసి ట్రాఫిక్‌నకు అంతరాయం కలిగిస్తే, వారిపై మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం రూ.వెయ్యి జరిమానా విధిస్తామన్నారు. వాహనాలు టోయింగ్ రికవరీ వ్యానతో తోసుకెళతమన్నారు..వీల్ లాక్స్ వేస్తామన్నారు. పార్కింగ్ సౌకర్యం ఉండి పార్కింగ్‌నకు వినియోగించని షాపుల యాజమానుల పై చట్ట ప్రకారం చర్య తీసుకుంటామని హెచ్చరించారు.
సీపీ ఆదేశాల మేరకు నగరంలో ఎవరైనా తల్లిదండ్రులు, వాహన యజమానులు మైనర్ పిల్లలకు వాహనం ఇస్తే. సెక్షన్ 190 & మోటార్ వాహనాల చట్టం ప్రకారం వారికి మూడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.25వేల జరిమానా విధిస్తారని తెలిపారు. అలాగే తాగి వాహనాలు నడిపిన వారిపైనా, మోటార్ వాహన నిబంధనలకు విరుద్ధంగా నెంబర్ ప్లేట్ గల వాహనాల పైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి బైక్ డ్రైవ్ చేసే సమయంలో హెల్మెట్ విధిగా వాడుతున్నారా లేదా అని గమనించి వారిని అప్రమత్తం చేయాలన్నారు.