బిహార్‌లోని భాగల్‌పూర్ ట్రిపుల్ ఐటీ విద్యార్థినులు రికార్డు స్థాయి ప్యాకేజీతో క్యాంపస్ ఇంటర్వ్యూల్లో జాబ్‌లు సాధించారు. ఇటీవల జరిగిన భాగల్‌పూర్ ట్రిపుల్ ఐటీ క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఇద్దరు విద్యార్థినులు ఈ జాక్‌పాట్ కొట్టారు. వీరు ఇద్దరు ఏడాదికి రూ.83 లక్షల జీతం అందుకోనున్నారు. అంటే నెలకు అక్షరాల రూ.7 లక్షల వరకు పొందనున్నారు. భాగల్‌పూర్ ట్రిపుల్ ఐటీలో బీటెక్ థర్డ్ ఇయర్ (కంప్యూటర్ సైన్స్) చదువుతున్న ఇషికా ఝా, సంస్కృతి మాలవీయ అనే స్టూడెంట్స్ ఈ బంపరాఫర్‌ను కొట్టేశారు.
హర్యానాలోని ఓ చిన్న పట్టణానికి చెందిన ఇషికా ఝా ఈ ఘనత సాధించడంతో ఆమె పేరు స్థానికంగానే కాదు.. దేశవ్యాప్తంగా మారుమోగిపోతోంది. ఇక మరో స్టూడెంట్ సంస్కృతి మాలవీయది ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్. అయితే తమ బీటెక్ 4 ఏళ్ల కోర్సు పూర్తి కాకముందే భారీ జీతాలతో క్యాంపస్ కొలువులు సాధించి గతంలో ఉన్న రికార్డులను కొల్లగొట్టారు. అయితే భాగల్‌పూర్ ట్రిపుల్ ఐటీలో బీటెక్ నాలుగో ఏడాది విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ నిర్వహించకుండానే.. మూడో ఏడాది విద్యార్థులకు ఇంటర్వ్యూలు ఏర్పాటు చేశారు. దీంతో 2020-2024 బ్యాచ్ కంటే ముందే 2021-2025 బ్యాచ్‌కు చెందిన ఇషికా ఝా, సంస్కృతి మాలవీయలు సీనియర్ల కంటే ముందే భారీ ప్యాకేజీతో జాబ్ కొట్టేశారు.
అయితే ఎలాగైనా క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ సాధించాలనే పట్టుదలతో భాగల్‌పూర్ ట్రిపుల్ ఐటీలో చేరిన ఇషికా ఝా, సంస్కృతి మాలవీయలు.. మంచి కంపెనీలో జాబ్ సాధించాలని మొదటి నుంచి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం ఫస్ట్ ఇయర్ నుంచే కోడింగ్ నేర్చుకోవడంపై దృష్టిపెట్టడంతో పాటు తగిన ప్రిపరేషన్, సీనియర్లతో మాక్ ఇంటర్వ్యూలు చేయడం చేశారు. క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు.. వాటికి ఎలా ప్రిపేర్ కావాలి అనే సమాచారాన్ని సీనియర్ల నుంచి తెలుసుకునేవారు.
గూగుల్ హ్యాకథాన్‌లో తాను పాల్గొన్నట్లు ఇషికా ఝా తెలిపారు. తనకు పర్యావరణ అంశం రాగా.. తాను రూపొందించిన ఫారెస్ట్ ఫైర్ ప్రిడెక్షన్ ప్రాజెక్టుకు అత్యధికంగా 2.5 శాతం మార్కులు వచ్చాయని తెలిపారు. ఇక సంస్కృతి మాలవీయ కూడా గూగుల్ హ్యాకథాన్‌లో మహిళా సాధికారతకు సంబంధించిన యాప్‌ను రూపొందించారు. మహిళలు తమ గుర్తింపును బహిర్గతం చేయకుండా పబ్లిక్‌గా షేర్ చేసుకొనేందుకు సిగ్గుపడే విషయాలను ఈ యాప్ ద్వారా పంచుకోవచ్చని సంస్కృతి మాలవీయ తెలిపారు. ఈ ప్రాజెక్టుకు గూగుల్ 2.5 శాతం మార్కులు ఇచ్చిందని సంస్కృతి చెప్పారు. ఇక ఇద్దరు స్టూడెంట్స్‌కు భారీ ప్యాకేజీ దక్కడం పట్ల భాగల్‌పూర్ ట్రిపుల్ ఐటీ యాజమాన్యం కూడా సంతోషం వ్యక్తం చేసింది.