సందేశ్‌ఖాలీ ఘటనలు పశ్చిమ బెంగాల్‌లోని అధికారంలో ఉన్న తృణముల్ కాంగ్రెస్ పార్టీని తీవ్ర ఇరకాటంలో పెడుతున్నాయి. ఈ క్రమంలోనే సందేశ్‌ఖాలీలోని మహిళపై టీఎంసీ పార్టీకి చెందిన నేతలు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని.. వారి భూములను ఆక్రమించారని తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ సందేశ్‌ఖాలీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న షేక్ షాజహాన్‌ను అరెస్ట్ చేయడంపై తామేమీ స్టే ఇవ్వలేదని కలకత్తా హైకోర్టు తాజాగా స్పష్టం చేసింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న షేక్ షాజహాన్‌ను అరెస్ట్ చేయాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది.
సందేశ్‌ఖాలీ హింసాత్మక ఘటనలకు సంబంధించిన కేసులో కలకత్తా హైకోర్టు సోమవారం విచారణ చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ నేత షాజహాన్ షేక్‌ను అరెస్టు చేయకూడదని తాము ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని ఈ సందర్భంగా హైకోర్టు స్పష్టం చేసింది. అతడిని అరెస్టు చేసి తీరాల్సిందేనని పశ్చిమ బెంగాల్ పోలీసులను ఆదేశించింది. ఆదివారం రాత్రి నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ.. సందేశ్‌ఖాలీ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. సందేశ్‌ఖాలీ కేసులో పశ్చిమ బెంగాల్ పోలీసుల చేతులను కలకత్తా హైకోర్టు కట్టేసిందని.. అందుకే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న షేక్ షాజహాన్‌ను అరెస్టు చేయలేకపోతున్నామని అభిషేక్ బెనర్జీ పేర్కొన్నారు.
దీనిపై సోమవారం కేసు విచారణ సందర్భంగా అభిషేక్ బెనర్జీ చేసిన వ్యాఖ్యలను అమికస్ క్యూరీ కలకత్తా హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. షేక్ షాజహాన్‌ను అరెస్ట్ చేయకుండా కోర్టు ఏమైనా స్టే ఇచ్చిందా లేదా అనే దానిపై స్పష్టతనివ్వాలని కోరారు. ఈ ప్రశ్నకు స్పందించిన కలకత్త హైకోర్టు.. అరెస్టుపై తాము ఎలాంటి స్టే విధించలేదని స్పష్టం చేసింది. సందేశ్‌ఖాలీ కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదైందని.. ఈ కేసులో షేక్ షాజహాన్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడని.. అలాంటప్పుడు అతడ్ని అరెస్టు చేయాల్సిందేనని కోర్టు తేల్చి చెప్పింది.
సందేశ్‌ఖాలీ ఘటనలకు సంబంధించిన వ్యవహారాన్ని కలకత్తా హైకోర్టు ఇప్పటికే సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో షేక్ షాజహాన్, ఈడీ, సీబీఐ, రాష్ట్ర హోం సెక్రటరీని పార్టీలుగా ఇంప్లీడ్ చేస్తున్నట్లు హైకోర్టు వెల్లడించింది. దీనిపై న్యూస్ పేపర్లలో పబ్లిక్ నోటీసు ఇవ్వాలని కోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. షేక్ షాజహాన్‌పై న్యాయపరమైన చర్యలు చేపట్టినట్లు అందులో పేర్కొనాలని సూచించింది. ఈ కేసులో తదుపరి విచారణను మార్చి 4 వ తేదీకి వాయిదా వేసింది.