పరువు నష్టం కేసులో విచారణ సందర్భంగా సుప్రీం కోర్టుకు హాజరైన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్.. అరవింద్ కేజ్రీవాల్ తన తప్పును ఒప్పుకున్నారు. ఓ యూట్యూబర్ సర్క్యులేట్ చేస్తున్న వీడియోను రీట్వీట్ చేసి తాను తప్పు చేశానని కేజ్రీవాల్ అంగీకరించారు. పరువుకు భంగం కలిగించే వీడియోను షేర్ చేసి తప్పు చేసినట్లు సోమవారం సుప్రీం కోర్టు ఎదుట కేజ్రీవాల్ ఒప్పుకున్నారు. అయితే ఇదే కేసులో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన సమన్లను సుప్రీం కోర్టులో సవాల్ చేసిన కేజ్రీవాల్ ఎట్టకేలకు తనదే తప్పని అంగీకరించడం గమనార్హం. తప్పును అంగీకరించడంతో పరువు నష్టం కేసులో కేజ్రీవాల్‌కు ఊరట లభించింది.
బీజేపీ ఐటీ సెల్‌కు సంబంధించి యూట్యూబర్ ధ్రువ్ రాఠీ అనే వ్యక్తి 2018 మే నెలలో అప్‌లోడ్ చేసిన ఒక వీడియోను అరవింద్ కేజ్రీవాల్ రీట్వీట్ చేశారు. అయితే ఆ వీడియో కొందరిని కించపరిచేలా ఉందని వికాస్ సాంకృత్యాయన్ అనే వ్యక్తి పరువు నష్టం కేసు దాఖలు చేశారు. దీనిపై ట్రయల్ కోర్టు అరవింద్ కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేసింది. ఆ ట్రయల్ కోర్టు సమన్లను ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. ఒకరిని కించపరిచేలా ఉన్న వీడియోను ఇతరులకు పంపడం కూడా పరువునష్టం చట్టం కింద నేరమే అవుతుందని పేర్కొంది. అలాంటి విషయాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.
ఈ సమయంలోనే ట్రయల్ కోర్టు ఇచ్చిన సమన్లను కొట్టివేయడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఈ క్రమంలోనే ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై కేజ్రీవాల్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. చివరికి ఆ వీడియోను రీట్వీట్ చేయడం తప్పేనని అంగీకరించారు. జర్మనీలో ఉండే ధ్రువ్ రాఠీ బీజేపీ ఐటీ సెల్ పార్ట్ II పేరిట.. తప్పుడు ఆరోపణలు ఉన్న ఒక వీడియోను సర్క్యులేట్ చేశారని.. ఆ వీడియోను అరవింద్ కేజ్రీవాల్‌పై ఫిర్యాదుదారుడు వికాస్ సాంకృత్యాయన్ పరువు నష్టం కేసు వేశారు.
ఇక ఈ పరువు నష్టం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ క్షమాపణలు తెలియజేయడంతో.. ఆయన తన తప్పును అంగీకరించారని ఇక ఈ కేసును ఇక్కడితో మూసివేయాలనుకుంటున్నారా అని సుప్రీంకోర్టు ఫిర్యాదుదారుడైన వికాస్ సాంకృత్యాయన్‌ను అడిగింది. మరోవైపు.. ఈ కేసులో మార్చి 11 వ తేదీ వరకు ట్రయల్ కోర్టు ఎలాంటి విచారణ చేపట్టవద్దని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ కేసులో కేజ్రీవాల్‌పై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకూడదని ట్రయల్ కోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది.