కర్ణాటక రాజధాని బెంగళూరు. ఈ పేరు వినగానే మన దేశంలోనే మోస్ట్ డెవలప్‌డ్ సిటీల జాబితాలో మొదటి వరుసలో ఉంటుంది. భారతదేశ సిలికాన్ వ్యాలీ అని కూడా బెంగళూరుకు పేరు. ఇదే కాదు ట్రాఫిక్‌లో కూడా టాప్‌లో ఉంటుంది. అయితే తాజాగా ఇప్పుడు బెంగళూరు నగరానికి నీటి సమస్య తలెత్తింది. వేసవి కాలం రాకముందే అక్కడ తాగు నీటి కోసం జనం తిప్పలు పడుతున్నారు. దీంతో వేసవి మొదలు కాకముందే.. బెంగళూరు మహా నగరం ఎండిపోతోంది. ఇప్పటికే పరిస్థితులు ఆందోళనగా మారగా.. రానున్న రోజులు ఇంకెంత ఘోరంగా ఉంటాయో అని బెంగళూరు వాసులు బెంగపడుతున్నారు. దేశంలోనే ఐటీ హబ్ అయిన బెంగళూరులో నీటి ఎద్దడి తలెత్తడంతో టెకీలు, టెక్ సంస్థలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
బెంగళూరు నగరానికి ప్రధాన నీటి వనరు కావేరీ నది. ఈ కావేరీ నది బేసిన్‌లో ఉన్న రిజర్వాయర్లలో నీరు లేకపోవడంతో.. భూగర్భ నీటి మట్టాలు కూడా తీవ్రంగా పడిపోతున్నాయి. ఈ క్రమంలోనే బోర్లు కూడా ఎండిపోతున్నాయి. దీనికి తోడు నైరుతి రుతుపవనాలు కూడా బలహీనపడటంతో వర్షాలు పడుతాయనే ఆశ కూడా లేకుండా పోయింది. ఇక కావేరీ నది బేసిన్‌లోని రిజర్వాయర్ల నుంచి బెంగళూరు వాటర్ సప్లై అండ్సీవరేజ్ బోర్డుకు.. నుంచి అధిక మొత్తంలో నీరు అందుతుంది. ఇక కావేరీ నది నీరు రాని ప్రాంతాలు.. బోర్‌వెల్స్, వాటర్ట్యాంకర్లపైనే ఆధారపడతాయి. ప్రస్తుతం బెంగళూరు నగరానికి రోజుకు 1450 మిలియన్లీటర్ల నీరు అందుతుండగా.. ఇంకో 1680 మిలియన్లీటర్ల నీటి కొరత ప్రతి రోజూ ఉంటోందని అధికారులు పేర్కొంటున్నారు.
బెంగళూరులో టెక్ కంపెనీలు ఉన్న మొత్తం 58 ప్రాంతాల్లో తీవ్ర నీటి సమస్య ఉందని అధికారులు చెబుతున్నారు. వైట్‌ఫీల్డ్, ఆర్ఆర్ నగర్, యెలహంక, దసరహల్లి జోన్స్, మహదేవపుర, బొమ్మనహల్లి లాంటి ప్రాంతాల్లో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే వాటర్ ట్యాంకర్లపై జనం భారీగా ఆధారపడుతుండటంతో వాటి ధరలు రెట్టింపయ్యాయి. గతంలో 12 వేల లీటర్ల ట్యాంకర్ రూ.10 నుంచి రూ.12 వందలు ఉండగా.. ప్రస్తుతం అది రూ.2 వేలకు చేరింది. ఈ నేపథ్యంలోనే బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు కీలక ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం ఉదయం 6 గంటల వరకు 24 గంటలపాటు నీటి సరఫరా బంద్ చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో నగర వాసులు మరింత భయపడుతున్నారు.
1.4 కోట్ల మంది నివసిస్తున్న బెంగళూరు నగరం ప్రస్తుతం తీవ్ర నీటి సమస్యను ఎదుర్కొంటోంది. రోజురోజుకు పెరుగుతున్న బెంగళూరు జనాభా కూడా నీటి సమస్యకు కారణం అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏటా బెంగళూరులో 10 లక్షల జనాభా పెరుగుతూ వస్తోందని అంచనా వేస్తున్నారు. కానీ మౌలిక వసతులు మాత్రం అదే స్థాయిలో అభివృద్ధి చెందకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు నెలకొంటున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఓ వైపు బెంగళూరు జనాభా పెరుగుతుంటే.. మరోవైపు నగరంలోని చెరువులు కబ్జాలు, ఆక్రమణలకు గురై కనిపించకుండా పోతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత 40 ఏళ్లలో బెంగళూరులో 79 శాతం నీటి వనరులు అంతరించిపోయాయని ఐఐఎస్‌సీ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది.
కావేరీ నదిపై మేకదాతు డ్యామ్‌నునిర్మించడమే బెంగళూరులో నీటి కొరతకు పరిష్కారం అని అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలోని సిద్ధరామయ్య ప్రభుత్వం చెబుతూ వస్తోంది. కానీ ఆ మేకదాతు డ్యామ్మాత్రం ఇప్పట్లో పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు. కావేరీ నదీ జలాలు, నదిపై నిర్మిస్తున్న ప్రాజెక్టుల గురించి కర్ణాటక- తమిళనాడు రాష్ట్రాల మధ్య తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. కావేరీ జలాల సరఫరాపై ఇరు రాష్ట్రాల మధ్య విభేదాలు తారస్థాయిలో ఉన్నాయి. బెంగళూరులో మంచీ నీటి కొరతను నివారించేందుకు ఈ ఏడాది బడ్జెట్‌లో సిద్ధరామయ్య సర్కార్ రూ.200 కోట్లను కేటాయించింది.
ఇక దేశంలోని ప్రధాన నగరాలు కూడా వేసవిలో ఇలాంటి పరిస్థితులనే ఎదురుకోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మెట్రో నగరాల్లో జనసాంద్రత ఎక్కువగా ఉండటం, వేసవి కాలంలో నీటి వనరులు తగ్గిపోవడంతో నీటి సమస్య ఎదురవుతోంది. ప్రతీసారి వేసవిలో చాలా నగరాలు ఇలాంటి నీటి ఎద్దడిని ఎదుర్కొంటూనే ఉన్నాయి. ఈసారి వేసవికి ముందే ఇలాంటి పరిస్థితులు రావడం.. ఈ ఏడాది ఎండలు భారీగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో మిగితా నగరాలు భయపడుతున్నాయి.