ఏపీలో బ్యాటరీ స్టోరేజ్ పవర్ ప్లాంట్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగు ప్రాంతాల్లో బ్యాటరీ స్టోరేజ్ పవర్ ప్లాంట్లు నిర్మించడానికి కేంద్రం అంగీకారం తెలిపినట్లు సమాచారం. వేయి మెగావాట్ల సామర్థ్యంతో ఈ బ్యాటరీ స్టోరేజ్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. ఈ ప్రాజెక్టుల కోసం కేంద్రం వయబులిటీ గ్యాప్ ఫండింగ్ కూడా పొడిగించింది. రాష్ట్రంలోని నాలుగు వేర్వేరు ప్రాంతాల్లో ఈ బ్యాటరీ స్టోరేజ్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నారు.
వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని మైలవరం, కర్నూలు జిల్లాలోని గని గ్రామం, కుప్పం నియోజకవర్గం, తూర్పుగోదావరి జిల్లాలలో ఈ బ్యాటరీ స్టోరేజ్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. ఇంధన శాఖ కూడా ఇవే పేర్లను ప్రతిపాదించినట్లు సమాచారం. వైఎస్ఆర్ జిల్లా మైలవరం వద్ద 400 మెగావాట్ల సామర్థ్యంతో బ్యాటరీ స్టోరేజ్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టును ఇంధన శాఖ ప్రతిపాదించినట్లు తెలిసింది. అయితే ఇక్కడ 750 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని తొలుత భావించారు. అందుకోసమే ఈ ప్రాంతాన్ని ఎంపిక చేశారు. అయితే సోలార్ ప్రాజెక్ట్‌కు బదులుగా బ్యాటరీ స్టోరేజ్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.
అలాగే కర్నూలు జిల్లా గని గ్రామంలో 400 మెగావాట్ల సామర్థ్యంతో బ్యాటరీ స్టోరేజీ పవర్ ప్లాంట్‌ను ప్రతిపాదించారు. అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలోనూ 100 మెగావాట్ల సామర్థ్యంతో బ్యాటరీ స్టోరేజ్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించారు. కుప్పం నియోజకవర్గం మొత్తాన్ని వంద శాతం సోలార్ విద్యుత్ నియోజకవర్గంగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రాజెక్టును అక్కడ ప్రతిపాదించినట్లు తెలిసింది. అలాగే గోదావరి గ్యాస్ పవర్ ప్రాజెక్టు సమీపంలో 100 మెగావాట్ల సామర్థ్యంతో మరో బ్యాటరీ స్టోరేజ్ పవర్ ప్లాంట్ ప్రతిపాదించారు. ఈ నాలుగు ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ చేపట్టనున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదిత ప్రాజెక్టులకు సుమారుగా రూ. 5,200 కోట్లు ఖర్చవుతుందని అంచనా.