గుజరాత్లోని దాహోద్ జిల్లా సంజెలి గ్రామానికి చెందిన ఓ మహిళ చాలా కాలంగా అత్తింటి వేధింపులతో బాధ పడుతోంది. కానీ ఆ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా మనసులోనే దాచుకుంది. ఏం చేస్తున్నా ఆమె ఇంటి నుంచి వెళ్లిపోకపోవడంతో.. మరింత కోపం పెంచుకున్న భర్త, అత్త, మామలు.. ఆమె పరువు తీయాలనుకున్నారు. ఈక్రమంలోనే ఆమెను అర్ధ నగ్నంగా మార్చి గ్రామంలో ఊరేగించాలనుకున్నారు. ముందుగా ఆమె బట్టలు విప్పి ఆపై ఆమెను ద్విచక్రవాహనానికి కట్టేశారు.
ఆ తర్వాత భర్త బైకును నడుపుతూ గ్రామంలో తిప్పగా.. పలువురు గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు ఆ దారుణాన్ని అడ్డుకుని మహిళకు అండగా నిలిచారు. అత్తింటి వారందరిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ కూడా చేశారు. తీవ్ర అవమాన భారంతో మహిళ కుంగిపోవడం చూసి.. తాము అండగా ఉంటామని బాధ పడొద్దని వివరించారు. వాళ్లే సొంత, అన్నాతమ్ముళ్లలా మారి మహిళ ఆత్మ గౌరవంగా బతికేలా చేశారు.
ముఖ్యంగా ఫతేపురాలో ఆమెకు ఓ కూరగాయల దుకాణం పెట్టించారు. ఓ గదిని అద్దెకు తీసుకుని ఏడాది పాటు కిరాయిని కూడా పోలీసులే చెల్లించారు. అలాగే ఒక నెల రోజుల పాటు మహిళ అమ్మేందుకు కావాల్సిన కూరగాయలను కూడా తామే కొనిస్తామని మాటిచ్చారు. మాట మీదుగానే కూరగాయలు, పండ్లను కూడా ఇప్పిస్తున్నారు. అలాగే మహిళ మళ్లీ అత్తింటి వారి వేధింపులకు గురికాకుండా ఉండేందుకు కూరగాయల దుకాణంలో సీసీటీవీ కెమెరాను కూడా ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం ఫుతేపురా పోలీస్ స్టేషన్కు చెందిన షీ టీమ్ ఈ దుకాణాన్ని పర్యవేక్షిస్తోంది. ప్రతీ వారం వాళ్లు మహిళ వద్దకు వెళ్లి ఆమె బాగోగులు తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. పోలీసుల మంచి మనసుకు నెటిజెన్లు ఫిదా అవుతున్నారు. నిజంగా ఇదీ ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మీలాంటి పోలీసులు ఉంటే దేశంలో అత్తింటి వేధింపులు భరిస్తున్న మహిళలు ఉండరని.. అలాగే వారి ఆత్మహత్యలు కూడా ఉండవంటూ చెప్పుకొస్తున్నారు.
![]() |
![]() |