ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కి ముందు ఆస్ట్రేలియా జట్టు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గాయాల బెడదతో టాప్ ప్లేయర్లు ఒక్కొక్కరుగా జట్టును వీడుతుండగా తాజాగా కమిన్స్ కూడా దూరమవ్వడంతో ఇప్పుడు నెక్స్ట్ కెప్టెన్ ఎవరు అనేది ప్రశ్నార్థకంగా మారింది.
ఆస్ట్రేలియాను గాయాల బెడద వెంటాడుతోంది. గాయాల కారణంగా మిచెల్ మార్ష్, హేజేల్‌వుడ్, పాట్ కమిన్స్ ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యారు. ఈ పరిస్థితుల్లో ఛాంపియన్స్ ట్రోఫీకి ఆస్ట్రేలియాను నడిపించే నాయకుడు ఎవరంటూ ఆ దేశ క్రికెట్ బోర్డు సతమతమవుతోంది. ఆల్రెడీ కెప్టెన్‌గా చేసిన వారినే నియమిస్తారా లేక కొత్తవారికి అవకాశం ఇస్తారా అనేది చూడాలి.
ప్రస్తుతం కెప్టెన్సీ రేసులో స్టీవ్ స్మిత్‌తో పాటు ట్రావిస్ హెడ్ ఉన్నారు. బోర్డర్-గావస్కర్ ట్రోఫీ తర్వాత కమిన్స్‌కు రెస్ట్ ఇచ్చి శ్రీలంక టూర్లో స్టీవ్ స్మిత్‌కు కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించారు. తొలి టెస్టులో స్మిత్ సెంచరీ చేయడంతో పాటు జట్టుకు కూడా విజయాన్ని అందించాడు. గతంలో కూడా కెప్టెన్‌గా చేసిన అనుభవం ఉండటంతో ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీకి స్టీవ్ స్మిత్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
మరోవైపు మంచి ఫామ్‌లో ఉన్న ట్రావిస్ హెడ్ పేరు కూడా బాగానే వినిపిస్తోంది. అరివీర భయంకర ఓపెనర్ హెడ్‌కు బాధ్యతలు ఇచ్చి జట్టులో మరింత ఉత్సాహాన్ని నింపే ఆలోచనలో కూడా ఆసీస్ బోర్డు ఉంది. మరి కొత్త కెప్టెన్‌తో బరిలోకి దిగనుందా? లేక అనుభవజ్ఞుడైన పాత కెప్టెన్‌కి పగ్గాలు ఇవ్వనుందా అనేది త్వరలోనే తేలనుంది. ఏదిఏమైనా కీలక ఆటగాళ్లు లేకుండానే ఆస్ట్రేలియా జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో అడుగుపెట్టనుంది.