భార్య మోసానికి భర్త బలైన ఈ విషాదకర ఈ సంఘటన తమిళనాడులో కన్యాకుమారిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కన్యాకుమారి జిల్లా నాగర్‌సోల్‌లోని విల్లుకురికి చెందిన బెంజిమిన్‌కు (47).. 2016లో సునీత (45) అనే మహిళతో వివాహం జరిగింది. వీరికి పిల్లలు లేకపోగా.. ఉపాధి కోసం బెంజమిన్ సౌదీ అరేబియాలో ఉంటున్నాడు. అక్కడ భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేసే బెంజిమిన్.. భార్య సునీతను సొంతూరిలోనే ఉంచాడు. కానీ, ఆమె ఇష్టం మేరకు తన పూర్వీకుల ఇంటిని అమ్మేసి... మరోచోట భార్య పేరుతో కొత్త భవనం నిర్మించాడు.
అయితే, ఇటీవల భార్య తీరు మారడంతో బెంజిమిన్‌కు ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చింది. దీనిపై ప్రశ్నించిన ప్రతిసారీ ఇరువురి మధ్య ఫోన్‌లోనే గొడవ జరిగేది. నెల రోజుల కిందట ఆమె ఇంట్లోంచి అకస్మాత్తుగా కనిపించకుండాపోయారు. ఈ విషయం తెలిసిన బెంజమిన్ సౌదీ నుంచి సొంతూరుకి హుటాహుటిన చేరుకున్నాడు. ఆమె ఆచూకీ కోసం గాలించి.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు మిస్సింగ్ కేసు నమోదుచేసి.. దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఆమె తన ప్రియుడితో వెళ్లిపోయిందని తెలిసింది. అంతేకాదు, ఇంటిని రూ.33 లక్షలకు అమ్మేసి... తిరువందికరైకి చెందిన సైజు అనే వ్యక్తితో ఉన్నట్లు తెలిసింది.
ఈ విషయం తెలిసి బెంజమిన్ గుండె బద్దలైంది. తాను ఎంతో కష్టపడి సంపాదించి ఇంటి నిర్మిస్తే.. భార్య మోసం చేసిందని ఆవేదనకు గురయ్యాడు. ఇంటిని అమ్మి ఆ డబ్బు తీసుకుని ప్రియుడితో వెళ్లిపోవడం తట్టుకోలేకపోయాడు. చివరకు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తన మరణానికి భార్య సునీత, ఆమె ప్రియుడు సైజు, ఆమె సోదరి షీలా కారణమని ఆరోపించాడు. ఈ మేరకు అతడు సెల్ఫీ వీడియో రికార్డు చేసి. . అనంతరం విషం తాగి బలవన్మరణం చేసుకున్నారు. వీడియో వైరల్ కావడంతో ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న ముగ్గురి కోసం గాలిస్తున్నారు.
![]() |
![]() |