పిల్లలకు విద్యా బుద్దులు నేర్పించి.. వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాల్సిన ఉపాధ్యాయులు కామాంధులుగా మారిపోయారు. తల్లిదండ్రుల తర్వాతి స్థానంలో ఉన్న గురువులు.. ఓ విద్యార్ధినిపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. దీంతో అభంశుభం తెలియని బాలిక గర్బం దాల్చింది. సభ్యసమాజం తలదించుకునే ఈ ఘటన తమిళనాడులో వెలుగుచూసింది. ఎనిమిదో తరగతి చదువుతోన్న 13 ఏళ్ల విద్యార్థినిపై ముగ్గురు ఉపాధ్యాయులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన కృష్ణగిరి సమీపంలోని ఓ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకుంది.
వారికి కామవాంఛకు బలైన అన్నెపున్నం ఎరుగుని ఆ చిన్నారి గర్బం దాల్చింది. తమ కుమార్తెకు జరిగిన దారుణాన్ని బయటకు చెప్పుకోలేక.. నిస్సాహాయులైన ఆమె తల్లిదండ్రులు అబార్షన్ చేయించడానికి ప్రయత్నించారు. వివరాల్లోకి వెళ్తే.. పోచంపల్లి గ్రామంలోని ప్రభుత్వ స్కూల్‌లో ఎనిమిదో తరగతి చదువుతోన్న విద్యార్థిని గత నెల రోజుల నుంచి స్కూల్‌కు వెళ్లలేదు. దీంతో ఏం జరిగిందోనని ఆ పాఠశాల హెడ్మాస్టర్, తోటి విద్యార్థినులు ఆరాతీశారు. బాలిక సరైన సమాధానం చెప్పకపోవడంతో ఆమె ఇంటికి వెళ్లారు. చివరకు ఆమె తల్లి చెప్పిన మాటలు విని వాళ్లు నిర్ఘాంతపోయారు. తన కుమార్తె గర్భం దాల్చిందని, అబార్షన్ చేయించడానికి ఆస్పత్రికి తీసుకెళుతున్నానని చెప్పింది.
బాలిక తల్లి అలా చెప్పింది విని హెడ్మాస్టర్ షాకయ్యారు. పాఠశాలలో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు, ఒక డిగ్రీ టీచర్ తనపై అత్యాచారానికి పాల్పడినట్లు బాలిక వెల్లడించింది. దీంతో శిశు సంక్షేమ సంరక్షణ అధికారులకు బాలిక తల్లిదండ్రులతో ఫిర్యాదు చేయించి.. తర్వాత మహిళా పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. దారుణానికి ఒడిగట్టిన ముగ్గుర్ని చిన్నసామి (57), ఆర్ముగం (45), ప్రకాశ్ (37) గా గుర్తించారు.
ఆ ముగ్గురు ఉపాధ్యాయులను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. బాధిత బాలికను వైద్య పరీక్షల కోసం కృష్ణగిరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు, ఈ ఘటన తమిళనాట తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. ముఖ్యమంత్రి స్టాలిన్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు నిరసనకు దిగాయి. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపిస్తున్నాయి. ఇటీవల అన్నా యూనివర్సిటీలో విద్యార్దినిపై జరిగిన అత్యాచార ఘటన తమిళనాడును కుదిపేసిన విషయం తెలిసిందే. తాజాగా, ఈ ఘటన వెలుగులోకి రావడంతో స్టాలిన్ సర్కారుపై విమర్శలు గుప్పిస్తున్నాయి.
![]() |
![]() |