ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐసీసీని వదలని ట్రంప్.. ఆంక్షలు విధించిన అమెరికా అధ్యక్షుడు!

international |  Suryaa Desk  | Published : Fri, Feb 07, 2025, 10:55 PM

రెండోసారి అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పద నిర్ణయాలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. వివిధ దేశాలపై సుంకాలను వడ్డిస్తూ వాణిజ్య యుద్ధానికి తెరతీశారు. తాజాగా, అంతర్జాతీయ నేర న్యాయస్థానాన్ని (ఐసీసీ) ఆయన వదలిపెట్టలేదు. తమతో పాటు మిత్రదేశం ఇజ్రాయేల్పై ‘చట్టవిరుద్ధమైన, నిరాధారమైన’ దర్యాప్తు చేశారని ఆగ్రహిస్తూ ఆయన ఐసీసీపై ఆంక్షలు విధించారు. ఈ మేరకు ట్రంప్ ఎగ్జిక్యూటీవ్ ఉత్తర్వులపై సంతకం చేశారు. ఇజ్రాయేల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు అమెరికా పర్యటన నేపథ్యంలో ట్రంప్ ఈ చర్యకు దిగడం గమనార్హం. ట్రంప్‌, నెతన్యాహు మంగళవారం శ్వేతసౌధంలో సమావేశమయ్యారు. అనంతరం క్యాపిటల్ హిల్లో చట్టసభ సభ్యులతో ఇజ్రాయేల్ ప్రధాని భేటీ అయి.. వివిధ అంశాలపై చర్చలు జరిపారు.


అక్టోబరు 7 నాటి హమాస్ దాడికి ప్రతీకారంగా గాజాపై చేపట్టిన సైనిక చర్యలో ఇజ్రాయేల్ యుద్ధ నేరాలకు పాల్పడ్డారని బెంజమిన్ నెతన్యాహుకు గత ఏడాది నవంబరులో ఐసీసీ అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఇజ్రాయెల్ సైన్యం మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని మండిపడింది.


ఈ క్రమంలో ఐసీసీపై గుర్రుగా ఉన్న ట్రంప్.. గురువారం ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ‘అంతర్జాతీయ నేర న్యాయస్థానం.. మా సన్నిహిత మిత్రదేశం ఇజ్రాయేల్ను లక్ష్యంగా చేసుకుని చట్టవిరుద్ధమైన, నిరాధారమైన చర్యలకు పాల్పడింది’ అని ఆరోపించారు. ఆ దేశ ప్రధాని నెతన్యాహు, ఆయన మాజీ రక్షణ మంత్రి యోవ్ గాలెంట్పై నిరాధారమైన అరెస్టు వారెంట్లు జారీచేసి.. అధికారాన్ని దుర్వినియోగం చేసిందని ఆగ్రహించారు. అమెరికా, ఇజ్రాయేల్పై ఐసీసీకి ఎలాంటి అధికార పరిధి లేదని తేల్చిచెప్పారు. ఇరు దేశాలపై చర్యలతో ఐసీసీ ప్రమాదకరమైన ఉదాహరణను సృష్టించిందని దుయ్యబట్టారు.


ట్రంప్ నిర్ణయంతో ఐసీసీ ఆస్తులను స్తంభింపజేయడం, ఐసీసీ అధికారులు, ఉద్యోగులు, వారి బంధువులు అమెరికాలోకి ప్రవేశించకుండా అగ్రరాజ్యం నిరోధించే చర్యలు తీసుకోవచ్చు. అయితే, ఐసీసీలో అమెరికా, ఇజ్రాయేల్‌లు సభ్యదేశాలు కావు. దీనిపై హేగ్‌లోని అంతర్జాతీయ నేర న్యాయస్థానం ఇంకా స్పందించలేదు.


వ్యక్తిగత ప్రభుత్వాలు చర్యలు తీసుకోడానికి వెనుకాడే ప్రపంచంలోని అత్యంత దారుణాలు, యుద్ధ నేరాలు, మానవాళికి వ్యతిరేకంగా నేరాలు, మారణహోమం వంటి వాటిపై విచారణకు చివరి ప్రయత్నంగా ఐసీసీ ఏర్పాటు చేసి రోమ్ డిక్లరేషన్‌లో ఆమోదంపై 1998లో జరిగిన చర్చలలో అమెరికా పాల్గొని, వ్యతిరేకంగా ఓటువేసింది. కానీ, 2000 ఏడాది నాటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఈ ఒప్పందంపై సంతకం చేసినప్పటికీ ఆమోదం కోసం సెనేట్కు పంపలేదు. ఆ మరుసటి ఏడాది 2001లో అధ్యక్షుడైన జార్జ్ బుష్ దీనిని రద్దు చేశారు. అమెరికన్లను ఐసీసీకి అప్పగించకుండా ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకునేలా దేశాలపై ఒత్తిడి తెచ్చే ప్రచారానికి ఆయన నేతృత్వం వహించారు.


అయితే, 2002 చట్టం కోర్టు ఆధీనంలో ఉన్న అమెరికన్ లేదా దాని మిత్రదేశాన్ని విడిపించడానికి పెంటగాన్‌కు అధికారం కల్పిస్తుంది. అఫ్గానిస్థాన్లో అమెరికా, దాని మిత్ర సైన్యాల యుద్ధ నేరాలపై దర్యాప్తు చేపట్టాలని చీఫ్ ప్రాసిక్యూటర్ కరీం ఖాన్ పూర్వీకురాలు ఫటౌ బెన్సౌడా తీసుకున్న నిర్ణయంపై 2020లో ట్రంప్ ఆంక్షలు విధించారు. అయితే, ఆ తర్వాత వచ్చిన జో బైడెన్ ఈ ఆంక్షలను త్తివేశారు. ఐసీసీ ట్రైబ్యునల్కి సహకరించడం మొదలుపెట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com